Telangana Gaddar Film Awards | గద్దర్ ఫిల్మ్ అవార్డు ఫంక్షన్‌లో తెలంగాణ సోయి ఏది? ఈ తెలంగాణ సినీ కళాకారులు, దిగ్గజ దర్శకుల ప్రస్తావనేది?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించే ఆలోచనతో.. ప్రముఖ దర్శకుడు, మెతుకుసీమ వాసి, రచయిత బీ నరసింగరావుతో సాంస్కృతిక పాలసీని తయారు చేయించారు. పాలసీలో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్సులో ప్రస్తావించలేదంటున్నారు తెలంగాణ ప్రాంత సినీ కళాకారులు.

Telangana Gaddar Film Awards | తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం అనేది తెలంగాణ రాష్ట్ర సినిమా కళాకారుల కార్యక్రమం. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి జరిగిన సినిమా మహోత్సవం ఇది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంత కళాకారులు హాజరుకావడాన్ని, అవార్డులు స్వీకరించడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర కళాకారులను ఆకాశానికి ఎత్తినందుకు ఎవరూ వేలెత్తి చూపడం లేదు కానీ, తెలంగాణ మట్టిపై పుట్టి జాతీయ, అంతర్జాతీయ కళాకారులుగా పేరొందిన వారి పేర్లను స్మరించకుండా విస్మరించడంపై కళామతల్లి ముద్దుబిడ్డల గుండెలను పిండేస్తున్నది. రేవంత్ రెడ్డి ఆ పేర్లను మర్చిపోయారా? లేక ఆయనకు ఆ స్పీచ్ రాసిచ్చినవారికి ఆ సోయి లేదా? అని తెలంగాణ కవులు, కళాకారులు చర్చించుకుంటున్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో శనివారం రాత్రి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్సు 2024 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి హాజరు కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను బహూకరించారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, రఘుపతి వెంకయ్య పురస్కారం, బీఎన్.రెడ్డి పురస్కారం, నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు, కాంతారావు, పైడి జయరాజ్ అవార్డులతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ క్యాటగిరీల్లో పురస్కారాలను కూడా ప్రదానం చేశారు. ఇందులో కాంతారావు ఫిల్మ్ అవార్డు, పైడి జైరాజ్ అవార్డులు పూర్తిగా తెలంగాణ కళాకారుల పేర్లతో ఉన్నవి. మిగతా ప్రత్యేక అవార్డులు మొత్తం ఆంధ్రా ప్రాంతానికి చెందినవని తెలంగాణ ప్రాంత సినీ కళాకారులు చెబుతున్నారు. అన్నింటికి మించి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినిమా పరిశ్రమలో తొలి తరం అంటే ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, రెండో తరంలో ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మూడో తరంలో కొణిదెల చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున వంటి హీరోలు ఉన్నారన్న రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం నాలుగో తరంలో కొణిదెల పవన్ కళ్యాణ్, ఘట్టమనేని మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉన్నారని గుర్తు చేశారు. డైరెక్టర్ రాజమౌళి ప్రపంచం గుర్తించేలా సినిమాలను తీస్తున్నారు కాని హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలంగాణ గడ్డకు తీసుకురావడం లేదని చెబుతూ.. వారు కూడా ఇక్కడకు రావాలంటే అందుకోసం మీకేమి కావాలో చెబితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతటి ప్రసంగంలోనూ ముఖ్యమంత్రి ఎక్కడా తెలంగాణ సోయి ఉన్నట్టు మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ మట్టిగడ్డపై పుట్టి చెన్నై, హైదరాబాద్, ముంబైలలో సినిమా రంగానికి సేవ చేసి, ప్రఖ్యాతి పొందిన కళాకారుల పేర్లను ప్రస్తావించకపోవడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది.
తెలంగాణ కళాకారులకు గౌరవమేది?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించే ఆలోచనతో.. ప్రముఖ దర్శకుడు, మెతుకుసీమ వాసి, రచయిత బీ నరసింగరావుతో సాంస్కృతిక పాలసీని తయారు చేయించారు. పాలసీలో ప్రస్తావించిన అంశాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్సులో ప్రస్తావించలేదంటున్నారు తెలంగాణ ప్రాంత సినీ కళాకారులు.
దేశ విదేశాల్లో ఖ్యాతిగాంచిన శ్యాంబెనెగల్
ఈ గడ్డపై పుట్టి దేశ, విదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారిలో భారతీయ సినిమా దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మశ్రీ శ్యాం బెనెగల్ 1934 సంవత్సరంలో హైదరాబాద్ నగరం తిరుమలగిరిలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్యాం సుందర్ బెనగల్. సికిందరాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని మహబూబ్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకుని, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ పట్టా అందుకున్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించ లేదని ఈ ప్రాంత కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో పైడి జైరాజ్
సిరిసిల్లలో అచ్యుతయ్య నాయుడు, తాయారమ్మ దంపతులకు జన్మించిన పైడి జైరాజ్ హిందీ చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. భారతీయ చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 1980లోనే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 156 చిత్రాలో కథానాయకుడి పాత్రలతో పాటు మొత్తం 300కు పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు. నిజాం కాలేజీలో చదువుకున్న జైరాజ్ సినిమాలపై మోజుతో 1929లోనే ముంబై చేరుకుని, శాంతారాం, పృథ్వీరాజ్ కపూర్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి వంటి నటీమణుల సరసన నటించి మెప్పించారు. హిందీలోనే కాకుండా మరాఠా, ఒడియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం భాషల్లో నటించి, తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు.
సినీ కళామతల్లికి సిందూరం కాంతారావు
తాడేపల్లి లక్ష్మీకాంతారావు 1923 సంవత్సరం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జన్మించి, అనేక సాంఘిక, పౌరాణిక, జానపద పాత్రలు చేశారు. మొత్తం 400కు పైగా సినిమాలలో నటించిన ఈయన నిర్దోషి చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. దర్శకులు దాసరి నారాయణ రావు మాటల్లో చెప్పాలంటే తెలుగు చలనచిత్ర సీమకు ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రెండు కళ్లు అయితే వాటి మధ్య నుదుటిపై తిలకం కాంతారావు.
పేద కళాకారుల కోసం తపించిన ప్రభాకర్‌రెడ్డి
తెలుగు సినిమా పరిశ్రమను చైన్నై నుంచి 1990 మొదట్లో హైదరాబాద్ కు తీసుకురావడంలో సినిమా నటుడు, రచయిత, వైద్యుడు మందాడి ప్రభాకర్ రెడ్డి పాత్ర చెరిపేయలేనిది. పేద సినిమా కళాకారుల కోసం చిత్రపురిలో తన 10 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935లో ప్రభాకర్ రెడ్డి జన్మించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి 1960 లో చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన తన 37 సంవత్సరాల సినిమా కేరీర్ లో 472 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
విలక్షణ దర్శకుడు నరసింగరావు
ప్రపంచ చలనచిత్ర పటంపై తెలంగాణ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శకులు, రచయిత బొంగు నరసింగరావు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామంలో 1946లో జన్మించిన ఆయన రంగుల కల, దాసి, మట్టి మనుషులు నిర్మాణం చేసి తెలంగాణ జీవన చిత్రాలనే తన సినిమాలుగా రూపొందించిన గొప్ప కళాకారుడు. మా భూమి సినిమాను 1979లోనే కైరో, సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, కార్లోవీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపచేయించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నరసింగరావు తీసిన ప్రతి సినిమా తెలంగాణ సినిమాకు ఒక గ్రామర్, బలమైన పునాదిని సృష్టించిందని ఇప్పటికీ చెప్పుకొంటారు. మట్టి మనుషులు మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లొమా, మా ఊరు హంగేరిలో అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుపొందింది.
క్లార్క్ గేబుల్ ఆఫ్ ఇండియా అజిత్
బాలీవుడ్‌లో క్లార్క్ గేబుల్ ను తలపించే అజిత్‌ఖాన్.. మన హైదరాబాద్ బిడ్డే. హిందీ సినిమారంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించాడు. గోల్కొండ కోట సమీపంలోని దక్కనీ ముస్లిం కుటుంబంలో హమీద్ అలీ ఖాన్‌గా జన్మించిన అజిత్.. పాఠశాల వయసులోనే సినిమా హీరోగా తోటి విద్యార్థులు ప్రశంసించేవారు. డబ్బులు లేకపోవడంతో పాఠ్యపుస్తకాలను అమ్మేసి, తల్లిదండ్రులకు చెప్పకుండా ముంబై వెళ్ళాడు. 1940ల్లో అదృష్టం అతనికి అనుకూలించలేదు. మొదట్లో చిన్నాచితక క్యారెక్టర్లు వేశాడు. 1946లో తొలిసారిగా షాహే మిశ్రా సినిమాలో గీతా బోస్ పక్కన నటించాడు. ఆ తర్వాత ప్రధాన నటుడిగా స్థిరపడ్డాడు. నానా భాయ్ భట్ సలహా మేరకు “అజిత్” అనే పేరును తన స్క్రీన్-నేమ్‌గా పెట్టుకున్నాడని చెబుతారు. టీ కృష్ణ, శంకర్ జైకిషన్ జంటలో శంకర్, విలనిజానికి తొలి ప్రతినిధి ఆర్ నాగేశ్వర్‌రావు, త్యాగరాజు ఇలా ఎందరో ఆయా తరాల్లో తెలుగు సినీ తెరను కళకళలాడించారు. అనేక మంది సాంకేతిక నిపుణులు తమ సత్తా చాటుకున్నారు. వీరందరినీ విస్మరించడం మనల్ని మనం అవమానపర్చుకోవడమేనని తెలంగాణ సినీ కళాకారులు చెబుతున్నారు.
తెలంగాణ పాలసీ ఏది?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ పాలనలో సమగ్ర సాంస్కృతిక విధానాన్ని రూపొందించడంలో విఫలమైంది. అవార్డులను బహూకరించేందుకు పాలసీ రూపొందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సమగ్ర సాంస్కృతిక విధానం తయారు చేయింది. అందులో.. సినిమాలకు సంబంధించి నిర్మాణం, ప్రచారం, ప్రదర్శన ఇలా మూడు రంగాలను అభివృద్ధి చేసేందుకు పది ఎకరాల స్థలంలో సినిమా కాంప్లెక్స్ నిర్మాణం చేయాలి. సినిమా అధ్యయనం కోసం శిక్షణ పరిశోధన కోసం శ్యాం బెనగల్ సినిమా అకాడెమీ ఏర్పాటు చేసి అందులోనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్, బాలల చలనచిత్రాల క్లబ్, ఫిలిం సొసైటీ కార్యాలయాల వేదిక, ఫిలిం ఇనిస్టిట్యూట్ స్థాపించాలి. తెలంగాణ సినిమా వైతాళికుడు బీఎస్.నారాయణ పేరుతో బీఎస్ఎన్ సినిమా రిక్రియేషన్ సెంటర్ ప్రారంభించాలి. ఇవే కాకుండా కాంతారావు సెంటర్ ఫర్ సినిమా హ్యాబిటేషన్ ఏర్పాటు చేసి, దీనికింద చిత్ర పరిశ్రమ కార్మికులు, కుటుంబాల కోసం రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు నిర్మాణం చేయాలి. ప్రభాకర్ రెడ్డి పేరుతో చలనచిత్ర స్టూడియోస్ పేరుతో ఆధునిక స్టూడియో నిర్మించాలి.. ఇలా.. తెలంగాణకు చెందిన సినిమా దర్శకుడు, కవి, రచయిత, బీ నరసింగరావుతో రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సాంస్కృతిక విధాన పత్రాన్ని తయారు చేయించింది. ఈ విధానపత్రంలో పేర్కొన్న అంశాలలో ఒక్కదాన్ని కూడా రేవంత్ రెడ్డి, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ బహూకరణ వేదికపై ప్రస్తావించకపోవడం యావత్ తెలంగాణ సమాజం లో చర్చనీయాంశంగా మారింది.