విభేదాలున్నాయీ… విభేదాలులేవూ!?.. మంత్రులు సురేఖ, సీతక్కల స్పందన

ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క గురువారం వేర్వేరు ప్రాంతాల్లో.. వేర్వేరు సందర్భాల్లో.. వేర్వేరు విషయాలపైన మీడియా ప్రశ్నలకు స్పందించిన తీరిది. కొండా సురేఖ వరంగల్‌లో తన నియోజకవర్గ పర్యటనలో పై విధంగా మాట్లాడితే... సీతక్క హైదరాబాద్‌లో ఈ విధంగా స్పందించారు.

విభేదాలున్నాయీ… విభేదాలులేవూ!?.. మంత్రులు సురేఖ, సీతక్కల స్పందన

విధాత ప్రత్యేక ప్రతినిధి:

Ministers Konda Surekha Seethakka |

మా మధ్య విభేదాలున్న మాట వాస్తవం. పార్టీ అన్న తర్వాత కొన్ని సందర్భాల్లో విభేదాలుంటాయి. నాతో విభేదాలున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాటిని మాదైన పద్ధతిలో సామరస్యంగా పరిష్కరించుకుంటాం.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
……………..

నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలూ లేవు. రాజకీయాల్లో ఎదగనివ్వాలి. ఎదుగుతుంటే సమాజంలో కొందరు ఓర్వలేక పోతున్నారు. ఇంట్లోనూ.. సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే అంతా బాగుంటుంది. గతతంలో అనారోగ్యం, సొంత పనుల వల్ల జాతరకు రాలేకపోయారు. మేము సమ్మక్క, సారలమ్మ లెక్క అక్కాచెల్లెళ్ళలాగా కలిసే ఉంటాం.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
……

పై వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా భిన్నమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలున్నాయనే అపోహ కలుగుతుంది. కానీ ఇక్కడ ఇది నిజం కాదు. ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క గురువారం వేర్వేరు ప్రాంతాల్లో.. వేర్వేరు సందర్భాల్లో.. వేర్వేరు విషయాలపైన మీడియా ప్రశ్నలకు స్పందించిన తీరిది. కొండా సురేఖ వరంగల్‌లో తన నియోజకవర్గ పర్యటనలో పై విధంగా మాట్లాడితే… సీతక్క హైదరాబాద్‌లో ఈ విధంగా స్పందించారు.

ఎమ్మెల్యేలతో విభేదాలపై సురేఖ స్పందన:

ఎమ్మెల్యేలతో తమకున్న విభేదాలపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సురేఖపై విధంగా స్పందించారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇంకా ఆ విభేదాలు సమసిపోలేదు. సమస్య రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ముందు ఉంది. కమిటీ ఈ అంశంపై చర్చించి నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కమిటీ వేసి పరిశీలించి పరిష్కరించాలని భావిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుక సందర్భంగా వరంగల్ నగరంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్సీ సారయ్య మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. జయంతి కార్యక్రమంలో వేర్వేరుగా పాల్గొన్నారు. ఇరువర్గాల నాయకుల అనుచరులు పరస్పరం జిందాబాద్‌లతో హోరెత్తించారు. ఈ విభేదాల నేపథ్యంలో గురువారం తూర్పు నియోజకవర్గంలో మంత్రి పర్యటించిన సందర్భంగా మీడియా ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ఇందులో మంత్రి సీతక్కకు సంబంధించిన అంశం లేదు.

మేడారంజాతర పైన సీతక్క స్పందన:

మంత్రి సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని సీతక్క అన్నారు. హైదరాబాద్ లో మంత్రి సీతక్క మీడియాతో మేడారం జాతర అంశం మాట్లాడిన నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖతో మీకు విభేదాలున్నాయనే ప్రచారం సాగుతోందంటున్నారంటూ మీడియా ప్రశ్నించడంతో సీతక్క పై విధంగా స్పందించారు. సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు. గత జాతరకు అనారోగ్యంతో సురేఖ హాజరుకాలేదంటూ తామిద్దరం సమక్క, సారలమ్మలెక్క అక్కాచెల్లెల్లలాగ కలిసే ఉంటామంటూ కితాబిచ్చారు. గత జాతరకు సురేఖ హాజరుకాలేక పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖ సైతం మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలులేవని, తామిద్దం కలిసిమెలిసి ఉంటామని కొద్ది రోజుల క్రితం ఒక సందర్భంలో స్పష్టం చేశారు.