Station Ghanpur | సవాళ్ళు.. ప్రతి సవాళ్ళతో మళ్లీ వేడెక్కిన ‘స్టేషన్ ఘన్‌పూర్’
కడియం కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ.. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన ఆయనపై రాజయ్య కాలు దువ్వుతూ వస్తున్నారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టుల వ్యాఖ్యానంతో ‘స్టేషన్’లో సైతం ఉప ఎన్నికలొస్తాయనే ప్రచారం సాగుతున్నది. ఇది సహజంగానే బీఆర్ఎస్‌లో ముఖ్యంగా రాజయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

- దూషణలు, కబ్జా, అక్రమ సంపాదన ఆరోపణలు
- కడియం వర్సెస్ తాటికొండ.. మధ్యలో పల్లా
- కడియంపై దేవునూరు భూ ఆక్రమణ ఆరోపణ
- నిరూపిస్తే గులాంగిరీకి సిద్ధమంటూ సవాల్
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
Station Ghanpur | రాష్ట్ర రాజకీయాల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నిరంతరం వ్యక్తిగత, రాజకీయ సంచలనాలకు నిలయంగా ఉంటున్నది. తాజాగా మరోసారి ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక్కడ కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య రాజకీయ యుద్ధం నిత్యకృత్యంగా మారింది. భిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ప్రారంభమైన వీరిద్దరి వైరం నేటికీ కొనసాగుతున్నది. ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉంటే ప్రత్యక్ష పోరు, ఒకే పార్టీలో ఉంటే ప్రచ్ఛన్న పోరు అన్నట్టు పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ రాజకీయ వైరి శిబిరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రోజువారీగా ఈ ఇద్దరి నాయకుల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. మధ్యలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య భూమిక నిర్వహిస్తూ ఈ నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకుల మధ్య రోజువారీగా సాగుతున్న సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో స్టేషన్ ఘన్‌పూర్, జనగామల్లో నిత్యం పొలిటికల్ హీట్ సెగలు పుట్టిస్తున్నది.
గత ఎన్నికలనాటికి కూడా ముగ్గురూ బీఆర్ఎస్ పార్టీ
కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయమంతా ఒకే పార్టీలో కొనసాగారు. ముగ్గురూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా, రైతు బంధు కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకే పార్టీ బీఆర్ఎస్‌లో కొనసాగారు. స్టేషన్ ఘన్‌పూర్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడమే కాకుండా.. విజయం సాధించారు. ఆఖరి క్షణం వరకు టికెట్ కోసం అలుపెరుగని పోరుచేసిన రాజయ్య ఆఖరికి అధిష్ఠానం నిర్ణయం ముందు మోకరిల్లి, పోటీ నుంచి తప్పుకొన్నారు. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తప్పించి ఆ స్థానం పల్లా రాజేశ్వర్ రెడ్డి చేజిక్కించుకున్నారు. ఈ విషయంలో ముత్తిరెడ్డి, పల్లా మధ్య బహిరంగ రచ్చే జరిగింది. బీఆర్ఎస్ అధినాయకత్వం అండదండలు ఉన్నందున పల్లా ఎమ్మెల్యే టికెట్ సాధించి బరిలో నిలిచి గెలిచారు.
కడియం కాంగ్రెస్‌లో చేరికతో మారిన సమీకరణాలు
స్టేషన్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా రాజయ్య వ్యవహరిస్తూ వచ్చారు. బీఆరెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు విఫలయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికల నాటికి నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కడియం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కడియం కుమార్తె డాక్టర్ కావ్య కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి వరకు కాంగ్రెస్ వైపు చూసిన రాజయ్య మళ్ళీ బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు.
పరస్పర దూషణలు, కబ్జా ఆరోపణలు
కడియం కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ.. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన ఆయనపై రాజయ్య కాలు దువ్వుతూ వస్తున్నారు. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టుల వ్యాఖ్యానంతో ‘స్టేషన్’లో సైతం ఉప ఎన్నికలొస్తాయనే ప్రచారం సాగుతున్నది. ఇది సహజంగానే బీఆర్ఎస్‌లో ముఖ్యంగా రాజయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు కడియం కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులందరికీ టార్గెట్‌గా మారారు. అప్పటి నుంచి కడియంపై రాజయ్యతో పాటు పల్లారాజేశ్వర్ రెడ్డి, ఇతర నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పరస్పరం దూషించుకోవడం పరిపాటిగా మారింది. వారి విమర్శలకు కడియం సైతం అంతే దీటుగా స్పందిస్తుండటంతో రాజకీయ వేడి పుడుతున్నది. ఇటీవల రూ.800 కోట్ల అభివృద్ధి పనులు సీఎం రేవంత్ ప్రారంభించారు. భారీ సభ పెట్టారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలొస్తాయనే చర్చ సాగింది. దీనికి తోడు ముగ్గురు నాయకుల మధ్య అక్రమ సంపాదనల విషయంలో ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. కడియం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పల్లాపై కడియం తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బొచ్చుకుక్కలాంటోడు, అధికారాన్ని అడ్డంపెట్టుకుని, కేసీఆర్ పేరుచెప్పుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నాడని ఆరోపించారు. దీనికి ప్రతిగా పల్లా స్పందిస్తూ తాను కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు కాపాలా కుక్కనే అంటూ దీటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో పల్లా, తాటికొండ కలిసి కడియం పై తీవ్ర విమర్శలు చేశారు. దేవునూరు పరిసర ప్రాంతంలో 50 ఎకరాల అటవీ భూములను ఇద్దరి పేరుతో కడియం ఆక్రమించారని ఆరోపించారు.
భూ కబ్జా నిరూపిస్తే గులాంగిరి చేస్తా: కడియం
భూ కబ్జా ఆరోపణలపై కడియం తీవ్రంగా ప్రతిస్పందించారు. పల్లా , తాటికొండ ఇద్దరూ దేవనూరుగుట్టలను సందర్శించాలని, తనపై చేసిన కబ్జా ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వాళ్లకు గులాంగిరీ చేస్తానని ప్రకటించారు. భూ కబ్జా ఆరోపణలు నిరూపించకపోతే ఆ ఇద్దరూ తనకు గులాంగిరీ చేయాలని అంటూ.. ఏ మాత్రం చీమూ, నెత్తురు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని కడియం డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికలొస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో తన కంటే పెద్ద లీడర్ ఎవరూ లేనందునే తనను టార్గెట్ చేస్తున్నారని కడియం విమర్శించారు.