Kaleshwaram Project | కాళేశ్వరం కేసులో కేసీఆర్ జైలుకు వెళతారా? క్లారిటీ ఇదే!
కాళేశ్వరం ప్రాజెక్టులో పేరుకు బరాజ్‌లు కట్టినా.. వాటిని చిన్న స్థాయి ఆనకట్టల స్థాయిలో నిర్మించారని ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు, విశ్లేషకుడు నైనాల గోవర్ధన్ వ్యాఖ్యానించారు. ఈ బరాజ్‌లలో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని తెలిపారు.

- విధాతకు నీటిపారుదల నిపుణులు, విశ్లేషకులు నైనాల గోవర్ధన్ ప్రత్యేక ఇంటర్వ్యూ
Kaleshwaram Project | హైదరాబాద్, ఆగస్ట్ 4 (విధాత) : కాళేశ్వరం ప్రాజెక్టులో పేరుకు బరాజ్‌లు కట్టినా.. వాటిని చిన్న స్థాయి ఆనకట్టల స్థాయిలో నిర్మించారని ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు, విశ్లేషకుడు నైనాల గోవర్ధన్ వ్యాఖ్యానించారు. ఈ బరాజ్‌లలో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉందని ‘విధాత’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంత భారీ ఎత్తున నీళ్లు నిల్వ చేయడం బరాజ్ నియమాలకు విరుద్ధమని ఎన్‌డీఎస్ఏ అధికారులు చెప్పిన విషయాన్ని గోవర్ధన్ ప్రస్తావించారు. 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టులకు అడుగు భాగాన రాక్ బెడ్ పునాది ఉండాలని ఆయన చెప్పారు. కానీ, అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌ల్లో పునాది సాండ్ బెడ్‌తో నిర్మించారని తెలిపారు. భూగర్భ పరీక్షలు చేయకుండానే ప్రాజెక్టులు నిర్మించి బరాజ్ నియమాలను కేసీఆర్ ఉల్లంఘించారని ఆరోపించారు.
గతంలో 2008 రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారన్నారు. వ్యాప్కోస్ సంస్థ సైతం తుమ్మిడిహట్టి అనువైన స్థలం అని చెప్పిందని గుర్తుచేశారు. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రాజెక్టు లొకేషన్ కాళేశ్వరంలోని మేడిగడ్డకు మార్చారన్నారు. 2019లో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు కలిసి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో.. 2021కే మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. అంతకంటే ముందే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వ్యాప్కోస్ సీఎండీగా ఉన్న రాజేందర్ గుప్తా ఇంట్లో పెద్ద ఎత్తున అక్రమ సంపాదనను, ఆస్తులను అధికారులు గుర్తించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ డబ్బంతా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి డబ్బే అని గోవర్ధన్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 94వేల కోట్లు ఖర్చు పెట్టినా.. 42వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఈఎన్సీగా బాధ్యతలు నిర్వహించిన మురళీధర్ రావు 98వేల ఎకరాలకు మాత్రమే నిరు అందిందని చెప్పారని గుర్తు చేశారు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆక్షేపించారు. 2019 నుంచి 2021 వరకు 160 టీఎంసీలు ఎత్తిపోశారని.. ఇందులో 99 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉపయోగపడ్డాయన్నారు.
ఎన్నికల ఖర్చులను సమకూర్చేందుకే ప్రాజెక్టుల నిర్మాణం
ప్రాజెక్టు బడ్జెట్‌ను పెంచడానికే వివిధ కారణాలతో భారీ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారని గోవర్ధన్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు, నాయకులు కుమ్మక్కై ప్రాజెక్టులు డిజైన్లు రూపొందిస్తున్నారని విమర్శించారు. అధికారంలో పార్టీలు మారుతున్నాయి తప్ప కాంట్రాక్టులు మారడం లేదన్నారు. 24 నెలల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా.. తమ తప్పేం లేదని, ఆనాటి మంత్రులు, సీఎం చెబితేనే ఒత్తిడికి గురిచేస్తేనే తాము సంతకాలు పెట్టినట్లు పీసీ ఘోష్ కమిషన్ ముందు సాగునీటి అధికారులు చెప్పడాన్ని గోవర్ధన్ ఉదహరించారు. కానీ, కేసీఆర్ తానేం చేయలేదని, ఇంజినీర్లే డిజైన్ చేశారని కమిషన్ ముందు చెప్పారంటూ నేరమంతా వారిపైకి నెట్టేశారని ఆక్షేపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పనిచేస్తున్న ఇంజినీర్ అధికారులు ఇటువంటి విషయాలను గుర్తించుకోవాలని సూచించారు.
కేసీఆర్‌ను జైలుకు పంపించే అవకాశం లేకపోవచ్చు
గత చరిత్ర చూస్తే ఇలాంటి కమిషన్ల నివేదికలతో ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని నైనాల గోవర్ధన్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌ను జైలుకు పంపించే అవకాశం లేకపోవచ్చని అంచనా వేశారు. అయితే, కమిషన్ రిపోర్టులో తప్పు అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందన్నారు. మేడిగడ్డలోని కుంగిపోయిన పియర్స్ ను డిస్మాంటిల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతోపాటు భూగర్భ, సాగునీటి రంగ నిపుణులతో కమిటీ వేయాలన్నారు. ఆ నివేదిక ఆధారంగా సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో కూల్చాల్సి ఉంటుందన్నారు. మేడిగడ్డ బరాజ్ పియర్స్ కుంగినప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ బాంబులు పెట్టారని ఆరోపించిందన్న గోవర్ధన్.. అప్పుడు అధికారంలోనే ఉన్న బీఆరెస్ నేతలు.. బాంబు పెట్టనివారిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వాస్తవాలకు భిన్నంగా ఉన్నది ఏదీ చరిత్రలో నిలవదన్నారు.
పియర్స్ పునరుద్దరణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు
కుంగిపోయిన పియర్స్ పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణం చేయాలంటే దీనిపై కమిటీ వేయాలని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు గోవర్ధన్ తెలిపారు. కమిటీ రిపోర్టు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, రాష్ట్ర స్థాయిలో లేదని వెల్లడించారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో నీటి నిల్వ చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. మేడిగడ్డ లాగే వాటిలోని పియర్స్ కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని అంచనావేశారు. దీంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ అసాధ్యమని ఎన్‌డీఎస్‌ఏ తుదినివేదికలో వెల్లడించినట్లు తెలిపారు. పునాది అడుగున ఉన్న ఇసుకంతా బయటకి వచ్చి.. బొయ్యారం ఏర్పడి కుంగిపోవడానికి ప్రధాన కారణమయిందని తెలిపారు. అయితే, మేడిగడ్డను పునరిద్ధరించడం లేదా పునర్నిర్మించడం కంటే తుమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ నిర్మించడం ఉత్తమమైన పని అని అభిప్రాయపడ్డారు. అలాగే, వెంటనే ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ముందడుగు వేయాలని నయనాల గోవర్ధన్ కోరారు.
ఇవి కూడా చదవండి..
Greenfield Highway | ఆ రూట్లో హైదరాబాద్, విజయవాడ ప్రయాణం రెండు గంటలే!
Pythons Fight Viral Video | రెండు కొండ చిలువల భీకరపోరు! రాను.. ఆస్ట్రేలియాకు రాను..
MLC kavitha | ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు: కవిత సంచలన ఆరోపణ
Prajwal Revanna | ప్రజ్వల్.. ఖైదీ నంబర్ 15528.. జీతం ఎంతో తెలుసా?Dharmasthala Mass Burial Case | ధర్మస్థల ఖననాల కేసు : రికార్డులన్నీ ధ్వంసం! RTI సమాధానంలో నివ్వెరబోయే అంశాలు!