Greenfield Highway  | ఆ రూట్లో హైదరాబాద్, విజయవాడ ప్రయాణం రెండు గంటలే!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ మధ్య ప్రయాణ దూరం తగ్గిపోనుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కైనా, లేదా హైదరాబాద్‌ నుంచి విజయవాడకైనా రెండు గంటల్లోనే చేరుకోవచ్చు.

Greenfield Highway  | ఆ రూట్లో హైదరాబాద్, విజయవాడ ప్రయాణం రెండు గంటలే!

Greenfield Highway  | రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ మధ్య ప్రయాణ దూరం తగ్గిపోనుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కైనా, లేదా హైదరాబాద్‌ నుంచి విజయవాడకైనా రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మేరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి ఆదివారం వనస్థలిపురం జంక్షన్‌లో మంత్రి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసని, ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామినిచ్చారు.

సుమారు 650 కోట్ల వ్యయంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నట్లు, హైదరాబాద్- విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. దీనికోసం కేంద్ర మంత్రి గడ్కరీని ఈనెల 6న కలుస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్న కేటీఆర్.. ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చింది తప్ప అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రజలే దేవుళ్ళుగా మారి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లలో కేసీఆర్ బిడ్డకు ఏం పని అని.. పదేళ్లు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎవరెంతో వారికంతా ఇవ్వాలనేది తమ ఇందిరమ్మ ప్రభుత్వ విధానమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్డీసీ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్థానిక నేతలు, ఇతరులు ఉన్నారు.