Kiwi Farming | ‘కివి’ సాగుతో ఏడాదికి రూ. 30 ల‌క్ష‌ల ఆదాయం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ స‌క్సెస్ స్టోరీ ఇదీ..!

Kiwi Farming | ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన త‌ర్వాత ఇంట్లోనే ఉండాల‌నుకుంటారు. మ‌నువ‌ళ్లు, మ‌నువ‌రాళ్ల‌తో కాల‌క్షేపం చేయాల‌నుకుంటారు. కానీ ఈ రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాత్రం.. అలా కాల‌క్షేపం చేయాల‌నుకోలేదు. త‌న‌కున్న పొలంలో ఏదో ఒక పంట పండించాల‌నుకున్నాడు. వాణిజ్య పంట అయిన కివి సాగు( Kiwi Farming ) మొద‌లుపెట్టి.. ఆరేండ్ల కాలం అనంత‌రం ఏడాదికి రూ. 35 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. మ‌రి ఈ రిటైర్డ్ ప్రిన్సిపాల్ భ‌వ‌న్ సింగ్ కొరంగా( Bhawan Singh Koranga ) స‌క్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఉత్త‌రాఖండ్‌( Uttarakhand )లో అడుగుపెట్టాల్సిందే.

Kiwi Farming | భ‌వ‌న్ సింగ్ కొరంగా( Bhawan Singh Koranga ) .. ఉత్త‌రాఖండ్( Uttarakhand ) భాగేశ్వ‌ర్ జిల్లా( Bageshwar district )లోని షామా గ్రామంలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఇంట‌ర్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. అది కూడా 2009లో. ఇక రిటైర్డ్ అయ్యాను క‌దా.. కాల‌క్షేపం చేయ‌లేదు.. త‌నకు చిన్న‌త‌నంలో ఆస‌క్తి ఉన్న వ్య‌వ‌సాయం( Agriculture ) వైపు అడుగులేశాడు. కివి పండ్ల( Kiwi fruits ) మొక్క‌ల‌ను నాటాడు. ప్ర‌స్తుతం నాలుగు ఎక‌రాల్లో కివి తోట‌ను సాగు చేస్తున్నాడు. మొత్తం 700 కివి మొక్క‌లు ఉన్నాయి. ఎక‌రానికి రూ. 7.5 ల‌క్ష‌ల సంపాదిస్తూ.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌ల ఆదాయం స‌ముపార్జిస్తున్నాడు.

భ‌వ‌న్‌కు వ్య‌వ‌సాయంపై మ‌క్కువ

అయితే భ‌వ‌న్ సింగ్ 6 నుంచి 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌వ‌సాయంపై టీచ‌ర్లు బోధించేవారు. అది కూడా ప్ర‌యోగాత్మ‌కంగా. దీంతో భ‌వ‌న్‌కు వ్య‌వ‌సాయంపై మ‌క్కువ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆగ్రా యూనివ‌ర్సిటీ నుంచి బీఎస్సీ(బ‌యాల‌జీ), బీఎడ్ పూర్తి చేశారు. కుమౌన్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ హిస్ట‌రీ ప‌ట్టా పుచ్చుకున్నారు. ఆ త‌ర్వాత నాలుగు ద‌శాబ్దాల పాటు ఇంట‌ర్ కాలేజీ విద్యార్థుల‌కు పాఠాలు చెప్పాడు. చివ‌ర‌కు ప్రిన్సిపాల్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాడు.

అప్పుడే భ‌వ‌న్ సింగ్‌కు ‘కివి’ ప‌రిచ‌యం

2003-04 మ‌ధ్య కాలంలో బాగేశ్వ‌ర్‌కు చెందిన కొంత‌మంది రైతులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు రాష్ట్ర స్థాయి ఉద్యాన‌వ‌న అభివృద్ధి ప‌థ‌కం కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అయితే ఈ రైతుల బృందంలో భ‌వ‌న్ సోద‌రుడు కూడా ఉన్నాడు. ఆయ‌న ఆ ప్ర‌ద‌ర్శ‌న నుంచి ఐదు కివి మొక్క‌ల‌ను భాగేశ్వ‌ర్‌కు తీసుకొచ్చాడు. అప్పుడే భ‌వ‌న్ సింగ్‌కు కివి ప‌రిచ‌యం అయింది.

ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఒక ఏడాది ముందు

ఇక ఆ ఐదు మొక్క‌ల‌ను నాట‌గా ఐదేండ్ల‌కు ఫలాలు కాయ‌డం ప్రారంభించాయి. కివి పండుకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంద‌ని గ్ర‌హించాను. ఈ క్ర‌మంలోనే ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఒక ఏడాది ముందు అంటే 2008లో కివి మొక్క‌ల‌ను నాటడం ప్రారంభించాడు భ‌వ‌న్ సింగ్.

ఒక్కో మొక్క‌ను రూ. 30కి కొనుగోలు

ఇందుకోసం గోవింద్ బ‌ల్ల‌భ్ పంత్ యూనివ‌ర్సిటీ నుంచి 100 కివి మొక్క‌ల‌ను కొనుగోలు చేశాడు భ‌వ‌న్ సింగ్. ఒక్కో మొక్క‌ను రూ. 30కి కొనుగోలు చేశాడు. అయితే త‌న పొలంలో కేవ‌లం 50 మొక్క‌ల‌ను నాటి, మిగ‌తా 50 మొక్క‌ల‌ను ఇత‌రుల‌కు పంపిణీ చేశాడు.

ఎకరానికి సుమారు 160 మొక్క‌ల‌ను నాటాడు

ఏడాదికి ఏడాది కివి సాగు విస్తీర్ణాన్ని పెంచాడు. మొత్తానికి ఎకరానికి సుమారు 160 మొక్క‌ల‌ను నాటాడు. ప్ర‌తి కివి తీగ‌కు దాదాపు 24 నుంచి 25 చద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లం అవ‌స‌రం. మొక్క‌ల మ‌ధ్య ఆరు మీట‌ర్లు, వ‌రుస‌ల మ‌ధ్య నాలుగు మీట‌ర్ల దూరం ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ఇక ఈ మొక్క‌ల కోసం టీ ఆకారంలో ఇనుప స్తంభాల‌ను నాటి.. తీగ వాటిపైకి వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకున్నాడు.

రైతుకు కేవ‌లం రూ. 3.6 ల‌క్ష‌లు మాత్రమే ఖ‌ర్చు

ఈ విధంగా చేసేందుకు ఎక‌రాకు రూ. 4.8 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంది. మొక్క‌లు, గుంత‌లు, ఎరువులు, ఇత‌ర సామాగ్రితో క‌లిపి మొత్తం ఖ‌ర్చు రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంద‌ని భ‌వ‌న్ సింగ్ తెలిపాడు. అయితే కివి తోట‌ల సాగుకు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం 70 శాతం సబ్సిడీని ఇస్తుంది. అంటే ఎక‌రానికి రూ. 12 ల‌క్ష‌ల పెట్టుబ‌డిలో.. రైతుకు కేవ‌లం రూ. 3.6 ల‌క్ష‌లు మాత్రమే ఖ‌ర్చు అవుతుంది. మిగిలిన ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని చెప్పాడు భ‌వ‌న్ సింగ్.

ప్ర‌తి గుంత‌ను 60 నుంచి 70 కిలోల కంపోస్టుతో

కివి సాగుకు అక్టోబ‌ర్ నెల అనుకూల‌మైంది. అక్టోబ‌ర్ నెల‌లోనే గుంత‌లు త‌వ్వాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత నెల‌న్న‌ర రోజుల పాటు గుంత‌ల‌ను ఖాళీగా వ‌దిలేయాలి. ఇలా చేయడం వ‌ల్ల హానిక‌ర‌మైన సూక్ష్మ‌జీవుల‌ను తొల‌గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది అని భ‌వ‌న్ తెలిపాడు. ఇక జ‌న‌వ‌రి – ఫిబ్ర‌వ‌రి నెల‌లో మొక్క‌లు నాటే ముందు.. ప్ర‌తి గుంత‌ను 60 నుంచి 70 కిలోల కంపోస్టుతో నింపుతారు. అనంత‌రం మొక్క‌ల‌ను నాటుతారు.

కేవ‌లం రెండు ప్ర‌ధాన కొమ్మ‌ల‌ను మాత్ర‌మే పెరిగేలా

మొద‌టి రెండేండ్ల వ‌ర‌కు కివి తీగ‌ను టీ ఆకార‌పు పందిరిపై పంపించేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. అయితే కివి కాండాలు మొద‌ట్లో బ‌ల‌హీనంగా ఉంటాయి.. కాబ‌ట్టి వాటికి వెదురు క‌ర్ర‌లు క‌ట్టి పందిరి పైకి పంపిస్తారు. తీగ పెరుగుతున్న కొద్ది కొమ్మ‌ల‌ను క‌త్తిరించాలి. కేవ‌లం రెండు ప్ర‌ధాన కొమ్మ‌ల‌ను మాత్ర‌మే పెరిగేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. మూడో ఏడాది నాటికి.. ఈ కొమ్మ‌ల నుంచి ఫ‌ల‌వంత‌మైన రెమ్మ‌లు అభివృద్ధి చెందుతాయి. అనంత‌రం మొక్క పూలు పూయ‌డం, ఫ‌లాలు కాయ‌డం ప్రారంభిస్తుందని భ‌వ‌న్ పేర్కొన్నాడు.

ప్ర‌తి తొమ్మిది ఆడ మొక్క‌ల‌కు ఒక మ‌గ మొక్క అవ‌స‌రం

కివి సాగులో అత్యంత కీల‌క‌మైన అంశం ప‌రాగ సంప‌ర్కం. కివి మొక్క‌లు మ‌గ లేదా ఆడ‌విగా ఉంటాయి. ప్ర‌తి తొమ్మిది ఆడ మొక్క‌ల‌కు ఒక మ‌గ మొక్క అవ‌స‌రం ఉంటుంది. కివి పువ్వులు చాలా త‌క్కువ మ‌క‌రందాన్ని ఉత్ప‌త్తి చేస్తాయి. పుప్పొడి బ‌రువుగా ఉంటుంది. కాబ‌ట్టి స‌హజ ప‌రాగ సంప‌ర్కం క‌ష్ట‌త‌రంతో కూడుకున్న‌ది. మంచి దిగుబ‌డి కోసం స్వ‌యంగా పువ్వుల‌కు ప‌రాగ సంప‌ర్కం చేస్తున్న‌ట్లు భ‌వ‌న్ సింగ్ పేర్కొన్నాడు. ఎనిమిది నుంచి ప‌ది ఆడ పువ్వుల‌కు ప‌రాగ సంప‌ర్కం చేసేందుకు ఒక మ‌గ పువ్వును ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలిపాడు. ఇలా చేయ‌డం వ‌ల్ల పండ్ల‌లో నాణ్య‌త ఉంటుంది.. దిగుబ‌డి కూడా అధికంగానే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు.

గ‌తేడాది 200 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి

ఈ సాగులో ఆరేండ్ల త‌ర్వాత చెప్పుకోద‌గ్గ దిగుబ‌డి ప్రారంభ‌మ‌వుతుంది. ఒక్కో తీగ ఏడాదికి 40 నుంచి 50 కిలోల పండ్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే కొన్ని మొక్క‌లు 100 కిలోల వ‌ర‌కు కూడా దిగుబ‌డిని ఇస్తాయ‌న్నాడు. ప్ర‌స్తుతం భ‌వ‌న్ సింగ్ 700 కివి తీగ‌ల‌ను సాగు చేస్తున్నాడు. గ‌తేడాది 200 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి వ‌చ్చింది. ఈ ఏడాది 250 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు భ‌వ‌న్ సింగ్ పేర్కొన్నాడు.

ఏడాదికి రూ. 30 ల‌క్ష‌ల ఆదాయం

కివి పండ్ల‌ను ముఖ్యంగా ఏ, బీ, సీ కేట‌గిరీలుగా వ‌ర్గీక‌రిస్తారు. సీ గ్రేడ్ ర‌కానికి చెందిన పండ్ల కిలో ధ‌ర రూ. 50గా ఉంది. బీ గ్రేడ్ పండ్లు కిలో ధ‌ర రూ. 100 నుంచి రూ. 200, ఏ గ్రేడ్ పండ్ల ధ‌ర రూ 150 నుంచి రూ. 250 వ‌ర‌కు ఉంటుంది. మా తోట‌లో ఏ గ్రేడ్ ర‌కానికి చెందిన పండ్లే అధిక దిగుబ‌డిని ఇస్తున్నాయ‌ని భ‌వ‌న్ తెలిపాడు. ఇలా ఏడాదికి రూ. 30 ల‌క్ష‌ల ఆదాయం సంపాదిస్తూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు భ‌వ‌న్ సింగ్.

Latest News