AP Assembly | తొలి రోజే వైసీపీ వాకౌట్.. కక్ష సాధింపు చర్యలకు దిగేది లేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం గవర్నర్ ప్రసంగంంతో ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలు..వాకౌట్‌ల మధ్య కొనసాగి వాయిదా పడ్డాయి.

గవర్నర్ ప్రసంగిస్తుండగా నినాదాలు
నల్ల కండువాలతో నిరసనలు
బీఏసీ సమావేశానికి గైర్హాజర్
5 రోజుల పాటు సమావేశాలు
బీఏసీ సమావేశంలో నిర్ణయం
కమిటీ హాల్లో ఎన్డీయే సభాపక్షం
ఇసుక వివాదాలకు దూరంగా ఉండాలి
ప్రజలు గెలిపించిందుకు అందుకు కాదు
ఎన్డీఏ పక్ష సమావేశంలో చంద్రబాబు
టోపీపై మూడు సింహాలకు అర్థం తెలుసుకో..
అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉన్నారని గుర్తుంచుకో
అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో జగన్ వాగ్వాదం
విధాత, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం గవర్నర్ ప్రసంగంంతో ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలు.. వాకౌట్‌ల మధ్య కొనసాగి వాయిదా పడ్డాయి. సమావేశాలకు ముందుగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ అవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా నల్ల కండువాలు మెడలో వేసుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు కండువాలు తీసెయ్యాలంటూ వారిని అడ్డుకోగా జగన్ వారితో వాగ్వాదానికి దిగి నల్ల కండువాలతోనే సభలోకి వెళ్లారు.
అనంతరం సభనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా.. వైసీపీ సభ్యులు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాసిన స్ర్కిప్ట్‌నే గవర్నర్ చదువుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు డౌన్ డౌన్, సేవ్ డెమోక్రసీ, హత్యా రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ ప్రసంగం కొద్దిసేపు ఎవరికీ సరిగా వినిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతున్నదంటూ అసెంబ్లీలో నిరసన తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేశారు.
బీఏసీ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజర్
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అనంతరం స్పీకర్ నిర్వహించిన బీఏసీ సమావేశానికి సైతం హాజరుకాలేదు. బీఏసీ సమావేశానికి రావాలని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఐనప్పటికీ వారు బీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టారు. మరోవైపు ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రవేశ పెట్టబోయే బిల్లులపై చర్చించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది.
కమిటీ హాల్లో ఎన్డీయే సభాపక్షం
అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు అసహనంతో ఉన్నారని కొందరు సభ్యులు వ్యాఖ్యానించారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారని పలువురు జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇసుక వివాదాలకు ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.
ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ మళ్లీ వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే మొదలుపెట్టారని, వినుకొండ వ్యవహారంలోనూ అదే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన వారిని చట్టప్రకారమే కఠినంగా శిక్షిద్దామన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానేనని.. కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తొలిరోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో జగన్ వాగ్వివాదం
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోశాంతిభద్రతల వైఫల్యం, వైసీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్ నేతృత్వంలో నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కుని చించేశారు. దీంతో పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యమని అన్నారు. పోస్టర్లు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదన్నారు. మధసూదన్ అనే పోలీస్ అధికారి పేరు ప్రస్తావిస్తూ.. గుర్తించుకో పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదని హెచ్చరించారు. నీ టోపీపై ఉన్న మూడు సింహాలకు అర్థం తెలుసుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉన్నారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది. అయితే సభ ప్రారంభం కావడంతో కాసేపటికే నల్లకండువాలతోనే వైసీపీ సభ్యులను పోలీసులు లోపలికి అనుమతించారు.