Tungabhadra Dam | కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌

కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది.

Tungabhadra Dam | కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌

దిగువన సుంకేశులకు లక్ష క్యూసెక్కుల నీటి విడుదల
ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
60టీఎంసీల వదిలాకే గేటు మరమ్మతు
డ్యాంను పరిశీలించిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, సీడబ్ల్యుసీ చైర్మన్ రవీంద్ర

విధాత, హైదరాబాద్‌ : కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయింది. ఎగువన షిమోగలో వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి వరద నియంత్రణలో భాగంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నదిలోకి చేరుతున్నాయి. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష ఎనిమిది వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎగువ వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను మేంటనెన్స్‌ చేసే వేళ సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు.

ఇందులో భాగంగా ప్రస్తుతం 33 గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నామన్నారు. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద చేరుతున్నందునా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. వరద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి ఐదారు రోజుల్లో 60 టీఎంసీలు దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలపై ప్రభావం పడనుంది. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకపోయిందని సీఎంకు సాయిప్రసాద్ తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్‌ను పంపాలని సీఎం సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్ అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యామ్ అధికారులతో మాట్లాడాలన్నారు.

తగిన సహకారం అందించాలని పయ్యావులకు సూచించారు. తాత్కాలిక స్టాప్ లాక్‌ గేటు ఏర్పాటుకు ఇబ్బందులున్నాయని పయ్యావుల కేశవ్ తెలిపారు. టీబీ డ్యామ్‌ 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడంవల్ల స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని కేశవ్ తెలిపారు. కాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనాస్థలికి ఏపీ ఇంజినీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను అదేశించామన్నారు. ఔతాలు, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులకు వరద ఉదృతికి సంబంధించి సమాచారం అందించామన్నారు.

తుంగభద్రత డ్యామ్‌ను పరిశీలించిన కర్నాటక డిప్యూటీ సీఎం

గేటు కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్‌ను ఆదివారం కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్, సీడబ్ల్యుసీ చైర్మన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, విరుపాక్షిలు పరిశీలించారు.ఈ సందర్భంగా డీకే శివ కుమార్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరన్నారు. తుంగభద్ర డ్యామ్ కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయిని అని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగతా నీటిని నదికి విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామని, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని తెలిపారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనని రైతులు సహకరించాలని డీకే శివకుమార్ చెప్పారు.