ప్రభుత్వం అండగా ఉంటుంది.. ప్రతి బాధితుడినీ ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ నాలుగు రోజుల పాటు తుపాను ప్రభావంతో అపార నష్టం కలిగిందని, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు

– తుపానుతో అపార నష్టం
– ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
– చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో
తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటన
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ నాలుగు రోజుల పాటు తుపాను ప్రభావంతో అపార నష్టం కలిగిందని, ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం, కర్లపాలెం మండలం పాతనందాయపాలెంలో తుఫాను బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తోడుగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడూ చూడని వాన నాలుగు రోజుల వ్యవధిలోనే కురిసిందన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థతో ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.
క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి, సచివాలయంలో పారదర్శకంగా సోషల్ ఆడిట్ కు అవకాశం కల్పిస్తామని తెలిపారు. చివరి బాధితుడి వరకూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు రేషన్ తో పాటు రూ.2500 ఆర్థిక సాయం అందించే చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి సాయాన్ని అందజేస్తారని చెప్పారు. కలెక్టర్లు ఎన్యూమరేన్ కార్యక్రమం పూర్తి చేశాక, 15 రోజుల పాటు సమయం ఇచ్చి సచివాలయాల్లో లిస్టును ప్రదర్శిస్తామన్నారు. వచ్చే సంక్రాంతి లోపు అందరికీ ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తుపానుతో అపార నష్టం జరిగిందని, ప్రభుత్వం తరపున చేయాల్సిన సాయం తప్పక చేస్తామని చెప్పారు. అంతకు ముందు సీఎం జగన్ తిరుపతి జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టాన్ని అంచనా వేశారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం
తోడవడం వల్లే తీవ్ర నష్టం : చంద్రబాబు
– వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవడం వల్లే తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన తుఫాను వరదలతో అల్లకల్లోలంగా మారిన ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. గుంటూరు జిల్లా అమర్తలూరులో బాబు మాట్లాడుతూ, తుఫాను సృష్టించిన విలయంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చేతికందిన పంట నీటి పాలైందన్నారు. సీఎం జగన్ కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని.. ఆలాంటి ముఖ్యమంత్రికి రైతుల బాధలు ఎలా తెలుస్తాయని విమర్శించారు. పంట కాలువల్లో పూడిక తీయకపోవడంతో వరద నీరంతా పొలాల్లోకి చొరబడిందని అన్నారు. ఇప్పటికే వరి కోతలు పూర్తయి, నూర్పిడి చేసిన రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుకున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో అవసరమైనన్ని గోనె సంచులు సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. ఫలితంగా చేతికొచ్చిన పంట వర్షార్పణం అయ్యిందని ఆవేదన చెందారు. తుఫాను వల్ల శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాలువలకు పూడిక తీయకపోవడంతోనే
తీవ్ర పంట నష్టం
– బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి
వర్షాలు ఆగి రెండు రోజులైనా నీరంతా పొలాల్లోనే ఉండిపోయిందని, కాలువలకు సకాలంలో పూడిక తీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, తీవ్ర పంట నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఏలూరు జిల్లా భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో ఆమె శుక్రవారం పర్యటించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె, ఈ విపత్తు రైతులకు కన్నీరే మిగిల్చిందని ఆవేదన చెందారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీరు నిలిచిన పంట పొలాల్లో దిగి నష్టాన్ని అంచనా వేశారు. సీఎం జగన్ కు రైతులంటే చిన్నచూపు అని, ఈ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని విమర్శించారు. తుపాను బాధితులను ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.