Banakacharla | పోలవరం – బనకచర్ల మనకొద్దంటూ ఏపీలో ఉద్యమం.. కారణాలివే..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, 82వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించదలచిన బనకచర్ల లింకేజ్ ప్రాజెక్టు ఏపీకి మేలు చేస్తుందా? గుదిబండగా మారుతుందా? ఆంధ్రప్రదేశ్‌లోని మేధావులు ఏమంటున్నారు?

Banakacharla | బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ విజయవాడ వేదికగా మేధావులు రంగంలోకి దిగారు. దీనికోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని, దీనిని ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ ప్రయోజనాల కోసం చేపట్టే ప్రాజెక్టేనని వెల్లడించారు. ఆలోచనాపరుల వేదిక పేరుతో ఏర్పాటయిన ఈ సంస్థ.. బనకచర్ల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయనాయకుల కడుపునింపేందుకు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని గుదిబండ ప్రాజెక్టుగా కుండబద్దలు కొట్టింది. ప్రధాన ప్రతిపక్షం కాంట్రాక్టు కంపెనీతో కుమ్మక్కయినందున, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలేదనని పిలుపునిచ్చింది. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టీ లక్ష్మీనారాయణతో కలిసి ఏర్పడిన ఆలోచనాపరుల వేదిక, విజయవాడలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి.. తాము బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు వద్దు అంటున్నదీ వివరించింది.
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు తొలుత కేసీఆర్, జగన్, మెగా కృష్ణారెడ్డి బుర్రల్లో పుట్టిందని, అయితే.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని అత్యంత వేగంగా కేంద్ర జల సంఘంతో ఆమోదింపజేసుకొని, కేంద్ర ఆర్థిక సహాయంతో నిర్మించేందుకు ఉవ్విళూరుతున్నారని వారు ఆరోపించారు. ఇదే సమయంలో ఈ విషయం తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఫుట్ బాల్‌గా మారిందన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత వచ్చిన బ్రజేశ్ ట్రిబ్యునల్.. రెండూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 800 టీఎంసీల (పునరుత్పత్తి జలాలతో కలిపి 811) కృష్ణా నికర జలాలని కేటాయించాయి. రాష్ట్రం విడిపోక ముందు ఇందులో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, 299 టీఎంసీలు తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు వినియోగంలో ఉండేవి’ అని వారు వివరించారు. గోదావరి జలాలపై ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 1480 టీఎంసీలు వచ్చాయని, వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణల మధ్య తలెత్తిన ఈ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి కేవలం 1350 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చేసిన యాగీ అంతా ఇంతా కాదని, కానీ.. 82,000 కోట్ల పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు విషయంలో నోరు విప్పకపోవడం, ఈ ప్రాజెక్టు ఆయన మానస పుత్రికేనని చెప్పకనే చెపుతున్నదని వారు విమర్శించారు. పాత, కొత్త ప్రభుత్వాలను అనుసంధానించే ఏకైక శక్తి మెగా ఇంజనీరింగ్ సంస్థకే ఉన్నదని బోధపడుతున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టుతో లాభాలకంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా నది నుంచి 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోతుందని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఇప్పుడు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులు కోల్పోతామని చెప్పారు.
ఇప్పుడున్న పట్టిసీమ కాల్వను పెద్దది చేసి అందులో 38,000 క్యూసెక్కుల నీరు పంపినా, లేక ఇంకో సమాంతర కాల్వను నిర్మించి 23,000 క్యూసెక్కులు పంపినా, కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిండుగా ప్రవహించినప్పుడల్లా, విజయవాడకు ప్రమాదపు గంటలు మోగుతాయని వారు హెచ్చరించారు. బనకచర్ల పథకం వల్ల రాయలసీమలో కొత్తగా సాగయ్యే ఆయకట్టు ఏదీ లేదని స్పష్టం చేశారు. దీని నిర్వహణ వ్యయం కూడా భారీగా ఉంటుందని తెలిపారు. సంవత్సరానికి ఎకరాకు 50,000 రూపాయలు ఉంటుందని, దీని ప్రాజెక్టు వ్యయం, దానిమీద వడ్డీలు కలిపితే లక్ష దాటిపోతుందని వివరించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ కు అవసరం లేనిదే కాకుండా.. నష్టదాయకమైనదని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్షం వహిస్తున్న మౌనం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కును సూచిస్తోందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు, ప్రజా సంఘాలే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందని తెలిపారు. ఆ చొరవలో భాగమే ప్రజలకు, మేధావులకు ఈ వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలని ఆశించారు.