Polavaram Nallamala Sagar link  | పోలవరం–నల్లమలను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టిందని తెలంగాణ ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఆ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, కచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు.

  • By: TAAZ |    telangana |    Published on : Jan 05, 2026 9:02 PM IST
Polavaram Nallamala Sagar link  | పోలవరం–నల్లమలను అడ్డుకుంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విధాత, హైదరాబాద్ :

Polavaram Nallamala Sagar link  | అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, కచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం  ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980 అవార్డుతో పాటు అంతర్రాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రాంగణంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరిపై భగ్గుమన్నారు.

మాజీ మంత్రి టీ హరీశ్‌ రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంతర్గతంగా సమాచారం కోసం పంపిన లేఖ మాత్రమేనని, అది సీడబ్ల్యూ సీ ఆమోదించినట్లు కాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ పూనుకున్నదని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఉత్తమ్‌ కొట్టిపారేశారు. పోలవరం–నల్లమల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి రివర్ మేనేజిమెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతో పాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయంతో పైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

గత నెల డిసెంబర్ 4 న కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదే ప్రాజెక్టును ఒక్క తెలంగాణా రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కుడా ఆక్షేపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్విని నియమించిందని ఆయన వివరించారు. అయితే ఈ రోజు (జనవరి 5వ తేదీ) జరగాల్సిన వాదనలు వచ్చే సోమవారం రోజుకు వాయిదా పడ్డాయని, రిట్ పిటిషన్ ను సూట్ పిటిషన్ గా మార్చి దాఖలు చేయాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సోమవారం జరగనున్న వాదనలకు స్వయంగా తాను హాజరు అవుతానని, మళ్ళీ స్టే ఆర్డర్ కోరతామని ఆయన తెలిపారు. ఇదే విషయమై రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలువరించడంలో విజయం సాధించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలకులు జల వనరుల నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని ఆయన విమర్శించారు. జూరాల నుండి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం కు, తుమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద తుమ్మిడి హట్టి ప్రాజెక్టును రీ-డిజైన్ చేయడం వంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని బీఆర్ఎస్ పాలకులు మోపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.

Read Also |

99 Rupees Goat | సంక్రాంతి బంపర్‌ ఆఫర్‌.. 99 రూపాయలకే 12 కిలోల మేకపోతు!
Polavaram Nallamala Sagar Project : పోలవరం – నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక సూచన
Kavitha new party| తెలంగాణ కొత్త రాజకీయ శక్తిగా ప్రజల్లోకి : కవిత ప్రకటన