Polavaram Nallamala Sagar Project : పోలవరం – నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక సూచన

పోలవరం-నల్లమలసాగర్‌ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ చేసిన వాదనలపై విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.

Polavaram Nallamala Sagar Project : పోలవరం – నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక సూచన

విధాత : పోలవరం – నల్లమలసాగర్‌ ప్రాజెక్టు వివాదంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించింది. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోరారు. పిటిషన్‌ దాఖలు తర్వాత కేంద్రం కమిటీని నియమించిందని తెలిపారు. అయితే కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి వాదనలను వినిపించారు. ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం అనుమతులు తీసుకున్నామని, తెలంగాణ గోదావరి, కృష్ణాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతుందని వాదించారు.

తెలంగాణ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఏపీ ఏకపక్షంగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు నిర్మిస్తుందని ఆరోపించారు. అవార్డు ప్రకారం ఉన్న నీటి కేటాయింపులను మించి వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని, గోదావరి జలాల్లో అవార్డు ప్రకారం కేటాయించిన 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తుందని తెలిపారు. వరద జలాల పేరుతో అదనంగా మరో 200టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోంది అని వాదించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకెలుతుందని, పొరుగు రాష్ట్రాల సమ్మతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు కూడా ఏపీ ఉల్లంఘించిందని, తక్షణమే స్టే ఇవ్వాలని కోరారు.

పోలవరం- నల్లమల్ల సాగర్ ను వ్యతిరేకిస్తున్నాం : మంత్రి ఉత్తమ్

పోలవరం-నల్లమల్ల సాగర్ ను అన్ని ఫోరమ్ లలో వ్యతిరేకిస్తున్నాం అని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు చూపిస్తున్న లేఖ దీనికి సంబంధించినది కాదు అని, పోలవరం-నల్లమల్ల ఇంటర్ స్టేట్ రూల్స్ కు వ్యతిరేకమని జీఆర్ఎంబీకి లేఖ రాశాం అని తెలిపారు. మా అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించింది అని, సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించాం అని వెల్లడించారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతాం అని, రాబోయే విచారణకు నేను డైరెక్ట్ గా అటెండ్ అవుతానని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Pandugappa Fish : గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం
Gold And Silver Price Today : మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు