బాబు, పవన్ భోగి సంబరాలు
భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు

– భోగి మంటల్లో పలు జీవో కాపీలు దహనం
– సాంప్రదాయ వేడుకతో మందడంలో కోలాహలం
– తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు
-‘కీడు తొలగాలి-ఏపీ వెలగాలి’ అంటూ నేతల పిలుపు
విధాత, అమరావతి: భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. ఆదివారం రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలు జోరందుకున్నాయి. ఇరు పార్టీల శ్రేణులు తరలిరావడంతో పండుగ శోభ సంతరించుకుంది. చంద్రబాబు పంచె కట్టుతో సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. టీడీపీ-జనసేన గుర్తులతో మహిళలు వేసిన ముగ్గులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘కీడు తొలగాలి-ఏపీ వెలగాలి’ నినాదంతో భోగి వేడుకలు చేపట్టారు. ఈసందర్భంగా భోగి మంటలు వెలిగించారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవో కాపీలను చంద్రబాబు, పవన్ తో సహా పార్టీ నేతలు, శ్రేణులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కాపీలు సైతం భోగి మంటల్లో తగులబెట్టారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా టీడీపీ-జనసేన పార్టీలు ‘రా.. కదలి రా’ కార్యక్రమానికి మూడు రోజుల పాటు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పిలుపు మేరకు భోగి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవో కాపీలను తగులపెట్టి నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. భోగి మంటలు వేసి జీవో కాపీలను తగులబెట్టారు.
ఐదేళ్లు చీకటి రోజులే.. : చంద్రబాబు
రాజధాని అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బందులు, ఆంక్షలు, జైలు ఊచలు లెక్కిస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఈ ఐదేళ్లు వారికి చీకటి రోజులే అయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో భాగంగా ‘తెలుగు జాతి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి త్వరలోనే మంచిరోజులు రానున్నాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలు కదలిరావాలని పిలుపునిచ్చారు. వరుసగా 87 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో నడవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుంటే సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు ఉపయోగపడుతుందని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రానికి పట్టిన పీడను భోగి మంటల్లో తగలబెట్టాం : పవన్
వైసీపీ పాలనలో నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను భోగి మంటల్లో తగలబెట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. భోగి వేడుకలను చంద్రబాబునాయుడుతో కలసి జరుపుకున్న పవన్… ఆదివారం మందడంలో భోగి మంటల్లో జీవో కాపీలను తగులబెట్టారు. ఈసందర్భంగా మాట్లాడిన పవన్ వచ్చే సంక్రాంతిని తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంలో ఘనంగా జరుపుకుందామని చెప్పారు. నేడు రాజధాని అమరావతి రైతులకు వచ్చిన కష్టం రేపు పులివెందుల ప్రజలకు కూడా రావొచ్చని అన్నారు. టీడీపీ-జనసేన మిత్ర కూటమిని చీల్చేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదన్నారు. వైసీపీ మరోసారి అధికారం చేపడితే రాష్ట్రంలో చీకట్లు తప్పవని హెచ్చరించారు. ఆ చీకటి పోయి వెలుగులు నింపాలనే సంకల్పంతోనే భోగి మంటలు వెలిగించినట్లు పవన్ చెప్పారు. రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతు కుటుంబాల్లో నిజమైన సంక్రాంతి శోభ నిండాలని ఆయన ఆకాంక్షించారు. రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందని ఆకాంక్షించారు.