ఏపీలో పెరిగే జిల్లాలతో నష్టాలున్నాయా? విశ్లేషకులు ఏమంటున్నారు?
తెలంగాణకు పోటీగా ఆంధ్రాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా అదనంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రాలో 26 జిల్లాలు ఉన్నాయి. ఆ సంఖ్యను 32కు పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది.
విధాత ప్రత్యేకం: తెలంగాణకు పోటీగా ఆంధ్రాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా అదనంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రాలో 26 జిల్లాలు ఉన్నాయి. ఆ సంఖ్యను 32కు పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. పరిధి పెద్దగా ఉన్న ఆంధ్రాలో 26 జిల్లాలు ఏంటనే వాదన రావడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నది. చిన్న జిల్లాల మూలంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు, అధికారులకు సరిపడా పని ఉండదనేది తెలంగాణలో నిరూపణ అయ్యింది. ఇదే రీతిన ఆంధ్రాలో కూడా విధ్వంసం జరుగుతుందని వ్యవసాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన, సరిహద్దు సమస్యలు, పేర్ల మార్పు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆగస్టు నెలలో ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం ప్రజల నుంచి అభ్యర్థనలు, అర్జీలను స్వీకరించింది. మంగళవారం ఉప సంఘం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై చర్చించాల్సి ఉంది. మెంథా తుఫాన్ కారణంగా సమావేశమవుతారా మరోరోజు వాయిదా వేస్తారా అనేది తెలియదు. సమావేశం నిర్వహించినప్పుడు కొత్త జిల్లాల విషయంలో ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి అందిన అభ్యర్థనలు వివరించి.. చంద్రబాబు నుంచి సూచనలు తీసుకోనున్నారు. వచ్చే నెల 7వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించేందుకు వీలుగా నివేదిక రూపొందించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఆ తరువాత కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ ఇస్తారు.
కుల–జనగణన నేపథ్యంలో ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్ 31వ తేదీ లోపు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీ మేరకు అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, రంపచోడవరం, పలాస జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు చేసిందని సమాచారం. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలను విడగొట్టి అమరావతి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో కొన్ని మండలాలు, డివిజన్లను గత ప్రభుత్వంలో తమకు అనుకూలంగా కలిపేశారని, దీంతో తాము అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా పరిశీలన జరిపి మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారని సమాచారం.
అమరావతితో వ్యవసాయ భూములు మాయం
అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయం మూలంగా మూడు పంటలు పండే మాగాణి భూములు మాయమయ్యాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటల దిగుబడి లేకుండాపోయింది. రాజధాని ప్రకటనతో సమీప ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలు భూములు కొనుగోలు చేశాయి. దీంతో వ్యవసాయం తగ్గి కమర్షియల్ బిజినెస్ పెరిగిందని ఆ ప్రాంత ప్రజలు లబోదిబోమంటున్నారు.
ఏపీలో తెలంగాణ మోడల్?
తెలంగాణ ఏర్పాటు అయ్యే నాటికి పది జిల్లాలు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి 33కు చేర్చింది. అడగని వారిదే తప్పన్నట్లుగా ఒకటి రెండు నియోజకవర్గాలకు ఒక జిల్లాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రాష్ట్రంలో జిల్లాల విషయంలో అయోమయం నెలకొంది. ఏ మండలం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందనేది విద్యార్థులు, అధ్యాపకులు, రాజకీయ నాయకులు చెప్పలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే మంత్రులకు బాధ్యత అప్పగించారు. తాము అధికారంలోకి వస్తే జిల్లాలను పునర్వ్యస్థీకరిస్తామని, ప్రజల అభిప్రాయం మేరకు కుదిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రిటైర్డు జడ్జ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయలేదు. బీఆరెస్ హయాంలో త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ రాష్ట్రాల మాదిరి జిల్లాలు ఏర్పాటు చేశారనే విమర్శలు ఉన్నాయి. కొత్త జిల్లాల కారణంగా రియల్ ఎస్టేట్ బూమ్ పెంచి బీఆర్ఎస్ నాయకులు వందల కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలూ బలంగానే ఉన్నాయి. ఉదాహరణకు గజ్వేల్ నియోజకవర్గంలో భూములు కొనేవారు లేరు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఒక ఎకరా భూమి ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.2 వరకు పలికింది. ఇప్పుడు అందులో సగం ధరకు విక్రయిస్తామని బతిమలాడుతున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడా భూములన్నీ బీడుగా మారిపోయాయి. ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల భూములు కోసం జిల్లాలు, మండలాలు వచ్చాయనే చర్చలు కూడా అప్పట్లో జోరుగా సాగాయి. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండేది. ఇక్కడికి నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు, రవాణా సౌకర్యం ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయం మూలంగా అది ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కొంగర కలాన్‌కు తరలిపోయింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే వినతి మేరకు ఏ సౌకర్యం లేని మైదాన ప్రాంతానికి తరలించారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్కడికి రాకపోకలు సాగించడానికి సామాన్యులు, రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
కొత్త జిల్లాలు తెలంగాణలో విఫలప్రయోగం అనే వాదనలు ఉన్నాయి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్ లతో పాటు వివిధ శాఖల అధికారులకు చేతినిండా పనిలేకుండా పోయింది. తెలంగాణలో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన జిల్లాలపై ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభత్వం అధ్యయనం చేయకుండా ముందుకు వెళ్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడున్న 26 జిల్లాలను 32కు పెంచుతున్నారు. ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం కాకుండా రాజకీయ నాయకులు, రియల్టర్ల కోసమేనని జిల్లాలు పెంచుతున్నట్టు కనిపిస్తున్నదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. కొత్త జిల్లాల కారణంగా తెలంగాణవ్యాప్తంగా జిల్లా కేంద్రాల చుట్టు పక్కల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఛిద్రం అయ్యాయి. వ్యవసాయ విధ్వంసం జరుగుతుందని తెలిసి కూడా ఏపీలో మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు మొగ్గుచూపడం పలువురిని ఆందోళనకు గురి చేస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలను శాస్త్రీయ విధానంలో 13 నుంచి 26కు పెంచారని, సౌలభ్యంగా ఉన్నాయంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram