AP Assembly | చిరంజీవి vs బాలకృష్ణ: అసెంబ్లీలో వివాదం, చిరంజీవి లేఖ సంచలనం!

ఏపీ అసెంబ్లీలో కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ సీరియస్ అయ్యారు. మధ్యలో చిరంజీవి పేరు రావడంతో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడతానని ప్రత్యేక లేఖ విడుల చేసారు. అసెంబ్లీలో చిచ్చురేపిన సినీ పరిశ్రమ వివాదం.

AP Assembly | చిరంజీవి vs బాలకృష్ణ: అసెంబ్లీలో వివాదం, చిరంజీవి లేఖ సంచలనం!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినీ పరిశ్రమ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చర్చ మధ్యలో చిరంజీవి పేరు ప్రస్తావనకు రాగా బాలకృష్ణ సీరియస్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చిరంజీవి జగన్‌ను గట్టిగా నిలదీశారని చెప్పగా, బాలకృష్ణ “అబద్ధం” అని ఖండించారు. దీనికి చిరంజీవి లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఇది సినీ మరియు పొలిటికల్ సర్కిల్స్‌లో భారీ చర్చకు దారితీసింది. ఫ్యాన్స్ సోషల్​ మీడియాలో చర్చలు మొదలు పెట్టారు. అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది.?

చిరంజీవిపై నోరుపారేసుకున్న బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ (గురువారం) హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ,  కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్​ మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అయితే దాంట్లో చిరంజీవి పేరు రావడంతో బాలకృష్ణ సీరియస్​ కావడం, చిరంజీవిపై వ్యంగంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు కొత్త జగడం మొదలైంది. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు జరిగిన అవమానంపై చర్చ జరుగుతుండగా, ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ తనదైన శైలిలో ప్రతిస్పందించారు.

కామినేని మాట్లాడుతూ — “ఆ సమయంలో జగన్ సినీ ప్రముఖులను కలిసేందుకు నిరాకరించగా, చిరంజీవి గట్టిగా అడిగాక సీఎం వారిని కలిశారు” అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణ ఏకీభవించలేదు.

బాలకృష్ణ స్పష్టంగా చెబుతూ — “ఆ రోజు గట్టిగా అడిగిన వాడెవ్వడూ లేడు. నాన్సెన్స్..  నిజానికి ఆ సైకో కలిసేందుకు నన్ను కూడా ఆహ్వానించారు, కానీ నేను వెళ్లలేదు. చిరంజీవిని అవమానించారన్నది మాత్రం నిజమే” అన్నారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో చర్చ కాసేపు వేడెక్కింది. కామినేని వ్యాఖ్యలు చిరంజీవి హీరోయిజాన్ని పెంచేలా ఉన్నాయని, కానీ వాస్తవానికి అలా జరగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అదే సమయంలో, సినీ పరిశ్రమను అవమానించే విధంగా అప్పటి ప్రభుత్వం ప్రవర్తించిందని కూడా బాలకృష్ణ ఎత్తి చూపారు. అలాగే కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ — “ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్ట్‌లో నా పేరు తొమ్మిదో స్థానంలో ముద్రించారు. ఆ రోజే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారిని ఎవడాడు దీన్ని రాసిందని నిలదీసాను” అని గుర్తు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ “సభకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి” అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే బాలయ్య వ్యాఖ్యలకు స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విదేశాల్లో ఉన్న చిరంజీవి ఈ మేరకు అసలు జరిగిందేమిటో వివరించారు.

చిరంజీవి పత్రికా ప్రకటన – గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడతా

అప్పట్లో ఏపీ సీఎంను కలిసిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు

అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం,

  • అప్పట్లో నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు కలిసి సినిమా టికెట్ల ధరల సమస్యపై మాట్లాడాలని కోరగా, ఆయన ముందుకు వచ్చారని చెప్పారు.
  • ఆహ్వానం మేరకే జగన్‌ను కలిసానని, సమావేశంలో ఆయనకు పరిశ్రమ ఇబ్బందులు వివరించానని వెల్లడించారు.
  • కోవిడ్ కారణంగా ఐదుగురే రావాలని ప్రభుత్వం చెప్పినా, తాను మరికొందరిని తీసుకువెళ్లానని వివరించారు.
  • బాలకృష్ణను కూడా సంప్రదించడానికి ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని, జెమిని కిరణ్ ద్వారా కూడా ప్రయత్నించామని చెప్పారు.

“నేను ఎవరితోనైనా, ముఖ్యమంత్రితోనైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగానే మాట్లాడతాను.  ముఖ్యమంత్రికి నచ్చచెప్పడంవల్ల టికెట్​ రేట్లు పెంచడానికి అనుమతించారు. దానివల్ల పరిశ్రమకు కొంత మేలు జరిగింది.” అని చిరంజీవి తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ ప్రకటనతో అసెంబ్లీలోని వివాదానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు గౌరవప్రదంగానే స్పందిస్తూ, తన వర్గం, పరిశ్రమ కోసం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో బాలకృష్ణ, కామినేని వ్యాఖ్యలు మరోసారి సినీ–రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. చిరంజీవి ఇచ్చిన పత్రికా ప్రకటన ఈ వివాదానికి ముగింపు పలుకుతుందా లేక కొత్త వివాదానికి తెర లేపుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికర విషయం.