T20 World Cup | టీ20 వరల్డ్ కప్ 2026కు రంగం సిద్ధం… ఓపెనింగ్ సెర్మనీలో బాద్‌షా–నోరా ఫతేహి సందడి

T20 World Cup |క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ ముగిసింది. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది.

  • By: sn |    movies |    Published on : Feb 07, 2026 8:58 AM IST
T20 World Cup | టీ20 వరల్డ్ కప్ 2026కు రంగం సిద్ధం… ఓపెనింగ్ సెర్మనీలో బాద్‌షా–నోరా ఫతేహి సందడి

T20 World Cup |క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ ముగిసింది. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. క్రీడలతో పాటు వినోదాన్ని మేళవిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ఐసీసీ ప్రత్యేక మ్యూజికల్ ఓపెనింగ్ సెర్మనీని ప్లాన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల దృష్టి ఈ ప్రారంభ వేడుకలపై నిలిచింది.

ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్ నోరా ఫతేహి, ప్రముఖ రాపర్ బాద్‌షా ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నారు. వీరితో పాటు నియో-క్లాసికల్ మ్యూజిక్ సెన్సేషన్, సితార్ విద్వాంసుడు రిషబ్ రిఖిరామ్ శర్మ, లెజెండరీ పర్కషనిస్ట్ శివమణి తమ ప్రదర్శనలతో స్టేడియంను ఉర్రూతలూగించనున్నారు. సంగీతం, నృత్యం, లైవ్ పెర్ఫార్మెన్సులతో ప్రారంభ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 60 వేల మంది ప్రేక్షకులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా బాద్‌షా మాట్లాడుతూ, “క్రీడలు మరియు సంగీతం ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి కలిగినవి. టీ20 వరల్డ్ కప్ వంటి మహోత్సవంలో భాగం కావడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. సితార్ విద్వాంసుడు రిషబ్ రిఖిరామ్ శర్మ మాట్లాడుతూ, “ఇంత పెద్ద వేదికపై శివమణి గారితో కలిసి ప్రదర్శన ఇవ్వడం నా కెరీర్‌లో మరిచిపోలేని అనుభూతి” అని అన్నారు.

ఇక టోర్నీ పోటీ పరంగా చూస్తే, భారత్ గ్రూప్–ఏలో నిలిచింది. ఈ గ్రూప్‌లో పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, యూఎస్ఏతో తలపడనుంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో మ్యాచ్ షెడ్యూల్ కాగా, ఆ మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. పాక్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ టీమిండియా మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు టోర్నీపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈసారి టైటిల్‌ను కాపాడుకుంటే చరిత్ర సృష్టించినట్టే. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్, మూడోసారి కప్ గెలిస్తే టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.