నదుల అనుసంధాన పక్రియ దేశ పురోగతి మార్గం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా ఖ్యాతి గడించిందటే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలే కారణం అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్మించకుంటే ఏపీ ఇబ్బంది పడేదని ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణాడెల్టాను గోదావరితో అనుసంధానం చేశామని గుర్తు చేశారు. 80 టీఎంసీలతో 13 లక్షల ఎకరాలు స్థిరీకరించాం అని, ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ అభివృద్ది ఉంటుందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి- గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు- కుంకుమలు సమర్పించారు. కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరి నుంచి ఏటా 2వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. ఎక్కడ నాకు పేరొస్తుందోనని.. నాడు పట్టిసీమ నిర్మిస్తుంటే అందరూ నన్ను విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారని, వారి విమర్శలు పట్టించకోకుండా రూ.1300 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ పూర్తిచేశానని, గోదావరి నుంచి కృష్ణానదికి 450 టీఎంసీలు తీసుకొచ్చాం. పట్టిసీమ వల్ల కరవు సీమ.. హార్టికల్చర్ హబ్‌గా తయారైంది. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే.. రాష్ట్రానికి కరవు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఖర్చు చేసి.. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఈనెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబరు 1న వెలిగొండ ఫేజ్-1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు.
ఏడాదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి.. కియా ఫ్యాక్టరీ ఏర్పాటును విజయవంతం చేసి ఈ ప్రాంత అభివృద్దికి బాటలు వేశామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిని నిర్మిస్తుంటే విమర్శిస్తున్నారని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపితే అమరావతి. 99శాతానికి పైగా రైతులు అమరావతికి భూములు ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్డులో ప్రయాణిస్తే.. అమరావతి విశిష్టత తెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.
