Rayachoti Terrorists Case | మూడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర.. రాయచోటి ఉగ్రవాదుల కేసులో కీలక అంశాలు

Rayachoti Terrorists Case | మూడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర.. రాయచోటి ఉగ్రవాదుల కేసులో కీలక అంశాలు

Rayachoti Terrorists Case | అన్నమయ్య జిల్లా రాయచోటిలో తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహ్మద్‌ అలీలు దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. రాయచోటిలో ఉగ్ర స్థావరాలకు సంబంధించి స్థానికంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పలు వివరాలను పోలీసు అధికారులతో కలిసి డీఐజీ వెల్లడించారు. రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారిపై విచారణ చేస్తున్నామని.. ఇక్కడ దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఐసిస్‌, అలూమా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయని.. అలూమా దక్షిణ భారత్‌లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని తెలిపారు. తమిళనాడు పోలీసుల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.

రాయచోటిలో నియామకాలు, శిక్షణ ఇచ్చినట్లు విచారణలో నిర్ధారణ కాలేదని.. అయితే పేలుడు సామగ్రి ఎలా వచ్చిందనేదానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదులు సాంకేతికంగా నిపుణులుగా ఉన్నారని.. రాయచోటిలో స్థిరపడిన తర్వాత 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఉందని డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసిన అమ్మోనియం నైట్రేట్‌, గన్‌ పౌడర్‌తోపాటు.. దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు లభించాయని వెల్లడించారు. పేలుడు పదార్థాల గురించి ఉగ్రవాదుల కుటుంబసభ్యులకు తెలుసా? లేదా? అనేది అనుమానాస్పదంగా ఉంది. వారికి తెలిసే చేశారా? లేదా? అనేది విచారణలో తేలుతుందన్నారు.

నిందితుల కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేశారని.. అబూబకర్‌ సిద్ధిఖీ భార్య షేక్‌ సైరాభాను, మహ్మద్‌ అలీ భార్య షేక్‌ షమీమ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. బట్టల వ్యాపారం ముసుగులో రాయచోటిలో మకాం వేసి ఇద్దరు కలిసి రాయచోటి ప్రాంతానికి చెందిన మహిళలను వివాహం చేసుకున్నారు. అన్న అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉండే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఓ చిల్లర దుకాణం ఏర్పాటుచేసి అక్కడ నుంచి కార్యకలాపాలు సాగించేవారని.. ఈ ఇద్దరు టెర్రరిస్టులు రాయచోటి పట్టణంలో కొందరికి ఉగ్ర కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారనే ప్రచారం రాయచోటి ప్రాంతంలో జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో గురువారం పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు, ఇస్లామిక్ టెర్రరిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.