యుద్దంలో డ్రోన్‌ టెక్నాలజీ గేమ్‌ ఛేంజర్‌: రాజ్‌నాథ్‌

పుట్టపర్తిలో రూ.15,803 కోట్ల AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్ సింగ్.. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్‌గా మారిందని పేర్కొన్నారు.

ఆధునిక కాలం యుద్దాలలో డ్రోన్ లు గేమ్ ఛేంజర్ గా మారాయని, అందుకే రక్షణ రంగంలో డ్రోన్ల టెక్నాలజీ అభివృద్దికి కేంద్రం ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్(AMCA) ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్, డ్రోన్ సిటీ లో రూ. 2959 కోట్ల విలువైన మూడు డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబులు శంకుస్థాపన చేశారు.

అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ కేంద్రం చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో ఆయుధాల తయారీ రంగంలో స్వావలంబన దిశగా కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందన్నారు. యుద్ధ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ కీలకమైన నేపథ్యంలో ఎనిమిది డ్రోన్‌ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్‌ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసేలా ఈ ప్రాజెక్టులు రాబోతున్నాయి అని, డ్రోన్ టెక్నాలజీ ఆధునిక వార్ ఫేర్ లో ఓ గేమ్ చేంజర్ గా మారింది. వీటితో పాటు వ్యవసాయం సహా వేర్వేరు అవసరాలకు వీటి ఉపయోగం ఉంటుందని గుర్తు చేశారు. సూరత్ డైమండ్ సిటీగా, బెంగుళూరు భారత సిలికాన్ వ్యాలీగా పేరు పోందాయి. ఇక కర్నూలు కూడా ప్రపంచ డ్రోన్ హబ్ గా ప్రసిద్ధి చెందుతుంది అని తెలిపారు. పుట్టపర్తి లాంటి ఓ విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఈ ప్రాజెక్టు ఏపీ సహా దేశ రక్షణ చరిత్రలో ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడించబోతోందన్నారు.

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా దేశం అడుగులు

రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకెళ్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పబ్లిక్‌, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని తెలిపారు.అంతర్జాతీయంగా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. దేశభద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేం. అందుకే ఆత్మనిర్భరత అనేది ఓ కీలకమైన అంశం అని, ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి అని స్పష్టం చేశారు. డ్రోన్ సిటీ ద్వారా ప్రపంచంలోని ప్రతీ మూలకూ మన డ్రోన్లు వెళ్లాలి. ఈ ప్రాజెక్టులతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు టౌన్ షిప్ లతో సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

ఇక్కడే ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్

పుట్టపర్తిలో ఏర్పాటు చేసే ప్రాజక్టును డీఆర్డీఓ లో భాగమైన ఏడీఏ అభివృద్ధి చేస్తోంది అని, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధునికతరం యుద్ధ విమానాల అభివృద్ధిపై పనిచేస్తోందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.ఇప్పుడు 5 తరం స్టెల్త్ యుద్ధ విమానం తయారు చేసేందుకు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేస్తోంది అని, రూ.15 వేల కోట్ల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు. ఇలాంటి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాలు కేవలం కొద్దిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ సరసన చేరిందని తెలిపారు. అమ్కా ప్రాజెక్టు నుంచి తయారయ్యే మొదటి విమానం ఇక్కడి నుంచే ఎగురుతుందని, బీడీఎల్ తయారు చేసిన టార్పెడో, హెచ్ఎఫ్ సీఎల్ నుంచి తయారయ్యే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కూడా ఈ నేల నుంచే పరీక్షిస్తాం అని వెల్లడించారు.

సముద్ర తీర రక్షణ బలోపేతానికి పుట్టపర్తి రక్షణ ఉత్పత్తులు

అమ్కా ప్రాజెక్టుతో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని చాటేలా మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయి అని, ఆ తరహా యుద్ధ విమానాలను పుట్టపర్తి నుంచి తయారు చేయబోతున్నాం అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా రూ.480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ వ్యవస్థలను, టార్పెడోలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకూ దిగుమతి చేసుకుంటున్న చాలా పరికరాలను కూడా స్వదేశీయంగా తయారు చేసుకోగలం అన్నారు. తద్వారా మన సముద్ర తీరప్రాంతాలకు పూర్తి రక్షణతో పాటు బ్లూ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఈ ప్రాజెక్టు మారుతుంది అని వివరించారు.

ఏపీ నుంచే త్రివిధ దళాలకు రక్షణ పరికరాలు

భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అగ్నేయాస్త్ర సంస్థ ఆధునిక ఆయుధాలను తయారు చేస్తుందని, రూ.1500 కోట్ల పెట్టుబడితో భవిష్యత్ లో యుద్ధానికి అవసరమైన ఆధునిక వ్యవస్థలు తయారు అవుతాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. హెచ్ఎఫ్ఎసీఎల్ రూ.1294 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్ ఫ్యూజ్ లు తయారు చేస్తుంది అని, 8 డ్రోన్ కంపెనీలు ఓ డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాయని, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాలు, టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేయబోతున్నాం అన్నారు. మన రక్షణ దళాలకు పూర్తి శక్తి సామర్ధ్యాలు అందించేలా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం అని తెలిపారు. పరిశ్రమలు, స్టార్టప్ లు, సంస్థలు అన్నీ కలిసి జన విప్లవంగా మారి దేశ అభివృద్ధి అనే మహాయజ్ఞం కోసం పనిచేస్తున్నాం అని, ఈ ప్రజా ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తోంది అని కొనియాడారు.

సైనిక పారిశ్రామిక సముదాయంగా ఏపీ

దేశానికి మిలట్రీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సుగా ఈ ప్రాంతాన్ని తయారు చేసేలా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. బెంగుళూరుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని సైనిక పారిశ్రామిక సముదాయంగా మారిస్తే దేశ అభివృద్ధికి కీలకం అవుతుందన్నారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో టెక్నాలజీ, అభివృద్ధి గురించి ఆలోచించే దార్శనిక నేత చంద్రబాబు నాయుడు లాంటి నేతను ఎక్కడా చూడలేదు అన్నారు. దేశ,విదేశాల్లో చాలా విశిష్టమైన పురస్కారాలు పొందిన నాయకుడిగా చంద్రబాబు క్వాంటం సహా ఆధునిక టెక్నాలజీలను ఏపీకి తీసుకువచ్చారు అని అభినందించారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయి అని, ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని, దేశానికి ఓ రోల్ మోడల్ గా ఏపీ మారింది అని ప్రశంసించారు.

రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన

గతంలో భారత్ అతిపెద్ద ఆయుధ దిగుమతి దారుగా ఉండేదని, గడచిన 10 ఏళ్ల నుంచి తీసుకున్న చర్యలతో పరిస్థితి మారిందని, గతంలో కేవలం రూ.46 వేల కోట్ల విలువైన ఆయుధాలు మాత్రమే తయారైతే.. ఇవాళ రూ. 1.54 లక్షల కోట్ల విలువైన ఆయుధ ఉత్పత్తి జరుగుతోందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు. మరికొన్ని రోజుల్లో ఇది రూ.1.75 లక్షల కోట్ల ఉత్పత్తికి చేరుతాం అన్నారు. ఆయుధ ఎగుమతులు కూడా కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఉండేదని, ఇవాళ రూ.40 వేల కోట్ల ఎగుమతులు చేయగలుగుతున్నాం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

అప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జేజీఎఫ్ : సీఎం చంద్రబాబు
హార్మూజ్ కు ప్రత్యామ్నాయం ఒమన్ పైప్ లైన్..ఆలస్యమైతే 60రెట్ల ఖర్చు

Latest News