అప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జేజీఎఫ్ : సీఎం చంద్రబాబు

కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు జేజీఎఫ్ అంటూ సీఎం చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను డిఫెన్స్, ఏరోస్పేస్, గోల్డ్ ఉత్పత్తి హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

అప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జేజీఎఫ్ : సీఎం చంద్రబాబు

రాయలసీమలో ఇనుపఖనిజం, సున్నపు రాయి లాంటి ఖనిజ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటాం అని..గతంలో గోల్డ్ అంటే KGF, ఇప్పుడు గోల్డ్ అంటే JGF అని..జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేజీఎఫ్ లో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుందని, రెండో ఏడాది 1500 కిలోల బంగారం తయారవుతుందని, రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ కీలకమవుతుందని అన్నారు.

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్(AMCA) ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్, డ్రోన్ సిటీ లో రూ. 2959 కోట్ల విలువైన మూడు డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబులు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. డిఫెన్స్, స్పేస్ , ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ లాంటి పరిశ్రమలతో రాయలసీమ రతనాల సీమగా మారుస్తాం అని, కొప్పర్తి పారిశ్రామిక నోడ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ గా మారుతుంది అని తెలిపారు. కడప స్టీల్ ప్లాంటును జూన్ లో ప్రారంభిసామని, 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం అని, స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుందన్నారు.

ఏఎంసీఏ ఏర్పాటుతో రక్షణ రంగంలో ఏపీ కీలక భూమిక

పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడ్డాయని, పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకంగా మారనుందని చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగానూ పుట్టపర్తి మారుతుందన్నారు. AMCA ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందని, భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించటంతో పాటు బలోపేతం చేయటంపై ప్రధాని దృష్టి సారించారు అని వెల్లడించారు. ఆధునికతరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసేలా AMCA ప్రాజెక్టు ఏర్పాటు అవుతోందన్నారు. రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు వస్తుందని, ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుందన్నారు. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటటంలో ఆపరేషన్ సింధూర్ ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఆపరేష్ సింధూర్ లో వినియోగించిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్ట్ చేశారు అని గుర్తు చేశారు. AMCA లాంటి ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.

దూసుకొస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్..జెట్ ఫైటర్ మేకింగ్ సెంటర్స్

తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్ దూసుకొచ్చినట్లుగా శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం అని, జెట్ ఫైటర్ల తయారీ, డ్రోన్ల తయారీ కేంద్రంగా సీమ మారుతుందని చంద్రబాబు తెలిపారు. కియా పరిశ్రమ 18 లక్షల కార్లు తయారు చేస్తోంది. ఈ కరవు సీమలో తయారైన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయన్నారు. ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల విషయంలో సమస్య ఉత్పన్నమైతే కేంద్రంతో మాట్లాడి మంత్రి లోకేష్ ఆ సమస్యను పరిష్కరించారని గుర్తు చేశారు. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అహోబిలం, పుట్టపర్తి లాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి.
సమర్ధ నీటి నిర్వహణతో జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. సమర్ధవంతమైన పాలన ఫలితంగానే రిజర్వాయర్లలో నిండుగా నీరు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్ తో తీసుకెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది. వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతదే అని స్పష్టం చేశారు.

23నెలల్లో 23లక్షల కోట్ల పెట్టుబడులు

గత పాలనలో విధ్వంసం చేశారు.పరిశ్రమలు తరిమేశారు.సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు అని చంద్రబాబు ఆరోపించారు. సంక్షేమం,అభివృద్ధి,సుపరిపాలనతో మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం అని, 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటివల్ల 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. యువతకు ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇతరులకూ మనమే ఉపాధి కల్పించేలా పరిశ్రమలు వస్తున్నాయి అన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రాజెక్టులు వచ్చాయి. రిలయన్స్, బీపీసీఎల్ లాంటి ప్రాజెక్టులు వస్తాయి అని చెప్పారు.

మూడు ఎకనామిక్ జోన్లతో పారిశ్రామిక ప్రగతి

విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు ఎకనామిక్ రీజియన్లలో పెట్టుబడులు వస్తాయి అని, చిప్ నుంచి షిప్ వరకూ మన దేశంలోనే తయారు కావాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు అని గుర్తు చేశారు. ఏపీలో డిజైన్ చేయండి, పెట్టుబడులు పెట్టండి, తయారు చేయాలని నేను కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం… వేగంగా అనుమతులిస్తాం అని, దేశానికి తిరుగులేని శక్తిగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తయారవుతాయి అన్నారు.

పశ్చిమాసియా సంక్షోభాన్ని అధిగమించేందుకు పొదుపు మార్గాలు

దేశానికి ఆర్ధిక భద్రత కూడా అత్యంత కీలకం అని, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మనపై కూడా పడిందని చంద్రబాబు తెలిపారు. ఇంధనం, బంగారం కొనుగోలుతో విదేశీ మారకనిల్వలు తరిగి పోతున్నాయి అని, నాదేశం- నాబాధ్యత అనే అంశంపై అందరం దృష్టి పెట్టాలి అన్నారు. ప్రధాని ప్రతిపాదించిన వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి 7 అంశాలను మనం కూడా ఆచరిద్దాం అన్నారు. ఇతర దేశాలు కూడా పొదుపు చర్యలు చేపట్టాయి. మనం కూడా బాధ్యతతో ముందుకు వెళ్లాలి అని స్పష్టం చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ సంఖ్యను తగ్గించాం. దీనిపై ఓ కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం అన్నారు. ప్రతీ భారతీయుడు సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీ సవాలును మనం ఓ అవకాశంగా మలచుకుందాం అని, ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం వహించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి :

హార్మూజ్ కు ప్రత్యామ్నాయం ఒమన్ పైప్ లైన్..ఆలస్యమైతే 60రెట్ల ఖర్చు
బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్