Deputy CM Pawan | గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి: డిప్యూటీ సీఎం

ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు

  • Publish Date - June 20, 2024 / 06:01 PM IST

ఉపాధి హామీ నిధులు సద్వినియోగం కావాలి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
ఉపాధి హామీ నిధులు, సోషల్ ఆడిట్ నిర్వహణపై సమీక్ష

విధాత: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు. సుమారు రెండున్నర గంటలసేపు సమీక్ష సమావేశం సాగింది.

ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, అందుకు సంబందించిన వివరాలను తెలియ చేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధి మేట్లు పరిధిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతి, నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతంగా గ్రామీణ అభివృద్ధి కోసం ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై చర్చించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకొంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ ను అనుసరించి ఓ పద్దతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కగా ఉండాలని  ఆదేశించారు.

Latest News