Road accident | కన్నకూతురును చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు తండ్రి.. తండ్రితోపాటు కొడుకు..!
Road accident : హాస్టల్‌లో ఉంటూ కాలేజీలో చదువుకుంటున్న కన్న కూతురును చూసేందుకు వెళ్లిన తండ్రి కానరాని లోకాలకు పోయాడు. తండ్రితోపాటే కొడుకు కూడా విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. రోడ్డు ప్రమాదం ఆ ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి వారి బైకును ఢీకొట్టింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉప్పరనాయుడు వలస గ్రామానికి చెందిన కరణం రామకృష్ణ, రత్నకుమారి దంపతులకు కుమార్తె సాత్విక, కుమారుడు సాయికరణ్ ఉన్నారు. కుమార్తె సాత్విక భోగాపురంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో కుమార్తెను చూసేందుకు రామకృష్ణ తన కొడుకుతో కలిసి వెళ్లాడు. కుమార్తెను చూసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది.
దాంతో వారి స్వగ్రామం ఉప్పరనాయుడువలసలో విషాదం అలముకుంది. వ్యవసాయం చేసే రామకృష్ణ దంపతులు కష్టమైనా ఇద్దరి పిల్లలను చదివిస్తున్నారు. అప్పులు చేసి ప్రైవేటు కళాశాలల్లో జాయిన్ చేశారు. కుమార్తె భోగాపురంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుండగా, కుమారుడు విశాఖపట్నంలో డిగ్రీ చదువుతున్నాడు. సెలవులు రావడంతో రెండు రోజుల క్రితం కుమారుడు సాయికిరణ్ ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో రామకృష్ణ ఆదివారం తన కుమరుడితో కలిసి కుమార్తెను చూసేందుకు ద్విచక్ర వాహనంపై భోగాపురం వెళ్లారు. సాత్వికను కలిసి బాగా చదువుకోవాలని చెప్పి ఇంటికి తిరుగు పయనమయ్యారు. రణస్థలం మండలం బంటుపల్లి జంక్షన్‌లోని బీరు ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కరణం రామకష్ణ (52), కుమారుడు సాయికిరణ్ (21) దుర్మరణం పాలయ్యారు.
స్థానికులు రామకష్ణ జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అడ్రస్ తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భర్త, కుమారుడు ఏకకాలంలో మృతి చెందడంతో రత్నకుమారి కన్నీరుమున్నీరైంది. రణస్థలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.