Journalist Kommineni | కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్.. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు

Journalist Kommineni | అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి తాజాగా మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. పథకం ప్రకారమే అమరావతి మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని.. పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమరావతిపై నిందలు మోపారని, వ్యాఖ్యల వెనుక కుట్రను ఛేదించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
డిబేట్ కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే జరిగిందని రిమాండ్ రిపోర్టులో రాసుకొచ్చారు. మరో జర్నలిస్ట్ అమరావతి మహిళలను ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటే కొమ్మినేని ఆ వ్యాఖ్యలను ఖండించకుండా సమర్థిస్తూ మాట్లాడారని పోలీసులు తెలిపారు . కొమ్మినేని శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు భగ్నం చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.