కాకినాడ వైద్యకళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

కఠిన చర్యలకు ఆదేశం
నలుగురిని సస్పెండ్..అరెస్టు
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలో(Rangaraya Medical College) విద్యార్థినిలపై ల్యాబ్ ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్ప ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. వివరాలను తెలుసుకున్న CM chandrababu Naidu నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగరాయ వైద్యకళాశాలలో బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల కొందరు ల్యాబ్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం వెలుగుచూసింది. ల్యాబ్ సహాయకుడు ఒకరు, మరో ఉద్యోగిపై కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరును దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు.
దీంతో జీజీహెచ్ కళాశాల యజమాన్యం ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్ చక్రవర్తితో పాటు టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నలుగురిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై నివేదికతో పాటు, తీసుకున్న చర్యలను కాకినాడ జీజీహెచ్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. అటు లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.