King Cobra India| 15 అడుగుల కింగ్ కోబ్రా.. చంపేశారు

కింగ్ కోబ్రా ఎదురుపడితే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతాం. అలాంటి భయంకర విషపూరిత భారీ కింగ్ కోబ్రా ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో కలకలం రేపింది. గిరిజనులు తమకు ఎదురుపడిన 15అడుగుల పొడవైన భారీ కింగ్ కోబ్రా(గిరి నాగు, రాచనాగు) తమపై దాడికి దిగవచ్చన్న ఆందోళనతో దానిని కొట్టి చంపేశారు.

విధాత: కింగ్ కోబ్రా ఎదురుపడితే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోతాం. అలాంటి భయంకర విషపూరిత భారీ కింగ్ కోబ్రా ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో కలకలం రేపింది. స్థానిక అడవుల్లో గిరిజనులు జీడి పిక్కలు సేకరిస్తున్న సమయంలో 15అడుగుల పొడవైన భారీ కింగ్ కోబ్రా(గిరి నాగు, రాచనాగు) వారికి ఎదురుపడింది. అయితే గిరినాగు తమపై దాడికి దిగవచ్చన్న ఆందోళనతో గిరిజనులు దానిని కొట్టి చంపేశారు.

వాస్తవానికి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలోని తూర్పు కనుమల అటవీ ప్రాంతం గిరినాగులు(కింగ్ కోబ్రా) సంరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ కింగ్ కోబ్రాను అమలు చేస్తుంది. 14 నుంచి 18 అడుగుల పొడవు పెరిగే కింగ్ కోబ్రాలు 15 ఏళ్ల వరకూ జీవిస్తాయి . ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమల్లో ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలోని అడవుల్లో కనపడే అరుదైన కింగ్ కోబ్రా జాతి పాముల్ని కాపాడేందుకు ప్రభుత్వపరంగా కింగ్ కోబ్రా ప్రాజెక్టు అమలు చేస్తుంది. స్థానిక వన్యప్రాణి సంరక్షకులు, అటవీ సిబ్బంది సహాయంతో జనావాసాల్లోకి వచ్చే కింగ్ కోబ్రాలను సురక్షితంగా పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలివేస్తారు.

జీవ వైవిద్య పరిరక్షణలో గిరినాగు కీలకం

అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి కింగ్ కోబ్రా అభయారణ్నాన్ని ఇక్కడి తూర్పు కనుమల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ‘కింగ్ కోబ్రా శాంక్చురీ’ ప్రాజెక్టు పేరుతో తూర్పు కనుమలలో పార్వతీ పురం మన్యం జిల్లాలో శంకరం రిజర్వ్ ల్యాండ్(కాశీపురం బీట్, జీవనాబాద్ రేంజ్ పాడేరు డివిజన్ లో 2,400హెక్టార్లను కేటాయించి.. కింగ్ కోబ్రా అభయారణ్యం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ కింగ్ కోబ్రా ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. కొన్ని నెలల క్రితం 30 గిరినాగు గుడ్లను భద్రపరిచి పిల్లలు పుట్టాక వాటిని తూర్పు కనుమల్లో వదిలారు.

పాములు గిరినాగుల ఆహారం

గిరినాగు విషపూరితమైనప్పటికి ప్రజలకు హాని కలిగించే విషపూరితమైన పాములను ఆహారంగా తీసుకుని వనంలో జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తుందని అటవీ అధికారులు వెల్లడించారు. విషపూరిత పాముల్లో అత్యంత పొడవుగా ఉండే కింగ్ కోబ్రాలు ఆహారంగా ఇతర పాములనే తింటాయి. ఎక్కువగా జెర్రి పోతులుగా పిలువబడే ర్యాట్ స్నేక్ లను తినే కింగ్ కోబ్రాలు ఇతర పాముల్నీ తింటుంటాయి. ఎలుకలను తింటూ రైతులకు వాటి సమస్యను పాములు తగ్గిస్తే పాములను తింటూ వాటి సంఖ్య మరీ మితిమీరిపోకుండా కింగ్ కోబ్రాలు తమ వంతు పాత్ర పోషిస్తాయి .

కింగ్ కోబ్రాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని అంటున్నారు ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ ప్రతినిధులు. ఒక్క కాటుతో ఏనుగును సైతం చంపగలిగే విషం ఉండే ఈ పాములు నిజానికి మనుషుల కంట పడేందుకు ఇష్టపడవు. వీటి కాటుతో మనుషులు చనిపోయిన సందర్భాలు చాల అరుదు. అయితే అప్పుడప్పుడూ దారితప్పి జనావాసాల్లోకి వచ్చేస్తున్న కోబ్రాలను చంపేసే గిరిజనులలో స్వచ్చంద సంఘాలు, వన్యప్రాణి సంరక్షణ విభాగాలు కల్పించిన అవగాహనతో కింగ్ కోబ్రాల సంరక్షణలో వారు కూడా భాగస్వామ్యలు అవుతున్నారు.

 

Latest News