విధాత : మాజీ మంత్రి ,మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విస్తరించేందుకు సిద్దమయ్యారు. తిరుపతి రేణిగుంట సమీపంలో పాత ‘శ్రీ కాలేజీ’ స్థలంలో ఏర్పాటు చేయనున్న “మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ”కి కేంద్రం అనుమతి పత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మల్లారెడ్డి ఏపీలో..అందులో తిరుమల తిరుపతిలో నా విద్యా సంస్థలను నెలకొల్పబోతుండటం పట్ల ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం రావడంతో నా జీవితం ధన్యమైందన్నారు.
సెప్టెంబర్ 9న నా జన్మదినంసందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతిలో ఓ యూనివర్సిటీకి అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నేను కొండ దిగగానే నాకు స్థలం, భవనాలతో కూడిన పాత శ్రీ కాలేజీ దక్కేలా చేశారని, వెంటనే ఆ భవనాలను ఆధునీకరించి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు కోరడం జరిగిందన్నారు.
శ్రీవారి అనుగ్రహంతో కేంద్ర ప్రభుత్వం నాకు ఇక్కడ రేణిగుంట విమానాశ్రయం దగ్గర “మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ”కి అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. అందుకే తాను ఈ రోజు శ్రీవారిని దర్శించుకుని సేవించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో మూడు యూనివర్సిటీల ద్వారా లక్షల మంది ప్రపంచ స్థాయి ఇంజనీర్లను, డాక్టర్లను, ఫార్మాసిస్టులను తయారు చేశానని, శ్రీవారి అనుగ్రహంతో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ సహకారంతో ఏపీలో కూడా రాయలసీమ, ఆంధ్ర ప్రజలకు మంచి ఇంజనీర్లను, ఏఐ నిపుణులను అందిస్తానని తెలిపారు.
