YS Jagan | టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత35 హత్యలు.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: వైసీపీ అధ్యక్షుడు జగన్
ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు దాడులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్.జగన్ బుధవారం ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరం వద్ధ ఏపీలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులు, ఆస్తుల విధ్వంసాలతో కూడిన ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు

ఢిల్లీ జంతర మంతర్ వద్ధ వైసీపీ అధినేత జగన్ ధర్నా
సంఘీభావం తెలిపిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్
కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి పార్టీల మద్దతు
బుల్డోజర్ సంస్కృతికి..రాజకీయ దాడులకు మేం వ్యతిరేకమని స్పష్టీకరణ
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని జగన్ ధ్వజం
విధాత, హైదరాబాద్ : ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు దాడులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్.జగన్ బుధవారం ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరం వద్ధ ఏపీలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులు, ఆస్తుల విధ్వంసాలతో కూడిన ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. బుక్‌లెట్ పంపిణీ చేశారు. జగన్ ధర్నాకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్, ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్‌రౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్‌లు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని పార్టీలన్ని జగన్ ధర్నాకు మద్దతు తెలిపాయి. జగన్‌కు ఇదే సరైన సమయమని, ఇండియా కూటమిలోకి రావాలని ఎంపీ తిరుమవలవన్ సూచించారు.
అధినేత అఖిలేష్ యాదవ్‌కు ఏపీలో జరుగుతున్న దాడులపై వీడియో రూపంలో జగన్ వివరించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. ప్రాణాలు తీయడం..దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. ఇవాళ జగన్ అధికారంలో లేకపోవచ్చు..రేపు రావచ్చని, అధికారంలో ఉన్న వాళ్లు శాంతియుతంగా ఉండాలని, విపక్షాలపై హింసకు దిగవద్దన్నారు. కఠిన పరిస్థితుల్లో జగన్ కార్యకర్తల కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ సంస్కృతి వచ్చిందన్నారు. బుల్డోజర్ సంస్కృతికి మేము వ్యతిరేకమన్నారు. యూపీ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఇలాంటి హింసాత్మక ఘటనలు ఎన్నో జరిగాయన్నారు. యూపీ సర్కార్‌తో మేం పోరాడుతున్నామని చెప్పారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ : జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. మా పార్టీ కార్యకర్తల వందల ఇళ్లను ధ్వంసం చేశారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారని, వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారని, మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. లోకేశ్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్‌లు పెట్టారని, తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, మీడియా… ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు సహరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.