ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..గోదావరిలో పెరిగిన వరద ఉదృతి నేపథ్యంలో పాపికొండల విహార యాత్ర బోట్ల సేవలను టూరిజం శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో బోట్ల రాకపోకలు నిలిపినట్లుగా ఏపీ టూరిజం శాఖ తెలిపింది. వాతావరణం అనుకూలించే వరకు బోట్ల సేవలు నిలిపివేస్తామని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాపికొండల విహారయాత్రకు రావొద్దని పర్యాటకులకు అధికారులు సూచించారు.
ప్రకృతి ఒడిలో పులకింత పాపికొండల విహార యాత్ర
భద్రాచల క్షేత్ర దర్శనం అనంతరం భక్తులు, పర్యాటకులు పాపికొండల అందాలను వీక్షించేందుకు క్యూ కడుతుంటారు. గోదావరి తీరంలో అద్భుత ప్రకృతి అందాలు, బోట్ ప్రయాణం అహ్లాదకరమైన అద్భుత అనూభూతిని అందిస్తుంటుంది. గోదావరి అలలపై పాపికొండల సౌందర్యం.. వెన్నెల రాత్రుల్లో ఇసుక తిన్నెల అందం పర్యాటకులను కట్టిపడేస్తుంది. దాదాపుగా 16బోట్లు అక్కడ పర్యాటకులకు సేవలందిస్తుండగా.. రోజుకు 1200మేరకు పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు వస్తున్నారు. వర్షాలు, వరదలతో తాత్కాలికంగా పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడినప్పటికి..పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పదని అధికారులు స్పష్టం చేశారు.
