• Telugu News
  • /Telangana

కొనసాగుతున్న వర్షాలు..ప్రాజెక్టులకు జల కళ

వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఎగువ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు..వరదల ప్రభావంతో నెమ్మదిగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. జురాల నుంచి శ్రీశైలానికి నీటి విడుదల కొనసాగుతుంది. గోదావరి పరివాహకంలో సైతం ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 30, 2026, 12:59 pm IST
Read Time: 9 mins
కొనసాగుతున్న వర్షాలు..ప్రాజెక్టులకు జల కళ

వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఎగువ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు..వరదల ప్రభావంతో నెమ్మదిగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గల జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగి 91 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రాజెక్టులో చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లను ఒక మీటర్ ఎత్తుకు ఎత్తి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు 81 వేల 695 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఇన్ ఫ్లో 91 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 81 వేల 695 క్యూసెక్కులు గా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం 317.35 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.371 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తుండటంతో జూరాల ఆయకట్టు రైతుల ఆశలు చిగురించాయి. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రలలో 11 యూనిట్ల లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నది పరివాహక దిగువ ప్రాంత ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

జూరాల నుంచి 79,403 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటలకు 824.80 అడుగులు.. నీటి నిల్వ 44.6090 టీఎంసీలుగా నమోదయింది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు. పరివాహక ప్రాంతాల వరదలతో నాగార్జునసాగర్‌లోకి 5,457 క్యూసెక్కుల ప్రవాహం చేరింది.

నిండు కుండలా కళకళలాడుతున్న కడెం ప్రాజెక్టు

గోదావరి నదిలో సైతం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో నీటి ఉదృతి పెరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితోపాటు, పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. గురువారం ఉదయానికి 27 అడుగులకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్లంపల్లికి 75 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. నంది, గాయత్రి పంపుహౌస్‌లలోని నాలుగు పంపుల ద్వారా 12 వేల క్యూసెక్కుల నీటిని మధ్యమానేరుకు విడుదల చేశారు.

స్థానికంగా కురిసిన వర్షాలతో కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పెరిగింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 21,048 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 700 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 691 అడుగులకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే లేదా మరింత పెరిగితే, ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీరామసాగర్‌లోకి 4,051 క్యూసెక్కులు ఉంది. సింగూరుకు 592, నిజాంసాగర్‌కు 6,585 క్యూసెక్కులకు అటుఇటుగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు జిల్లాలో బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుంది.  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో  బెజ్జూర్ మండలంలో  కృష్ణపల్లి వాగు వాగు ఉప్పొంగడంతో మండల కేంద్రానికి 12 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి.

తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం

ఛత్తీస్‌గఢ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు 24 గేట్లను ఎత్తి, 98,761 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 72.57 మీటర్లకు చేరుకోగా, గరిష్ఠ నీటిమట్టం 74 మీటర్లు. అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మంచిర్యాల దగ్గర ఉదృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు

మంచిర్యాల దగ్గర ఉదృతంగా రాళ్లవాగు పోటెత్తింది. ప్రస్తుతం 26,141 క్యూసెక్కుల ప్రవాహాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీకి మోసుకెళ్తుంది. సుందిళ్ల, అన్నారంలో కనీస డ్రాడౌన్ స్థాయిలో నీటిని నిల్వ చేసి గేట్లను ఎత్తితే ఎల్ నినో ప్రభావం నుండి కొంత బయటపడవచ్చని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం పంప్ హౌస్ నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.