PM Modi : సేవ, భక్తి, జ్ఞానం..అవే శ్రీ సత్యసాయి బోధనలు: ప్రధాని మోదీ

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సేవ–భక్తి–జ్ఞానమే భారతీయ జీవన విధానం, అదే సత్యసాయి బోధన అని పేర్కొన్నారు. రూ.100 నాణేన్ని విడుదల చేశారు.

PM Modi : సేవ, భక్తి, జ్ఞానం..అవే శ్రీ సత్యసాయి బోధనలు: ప్రధాని మోదీ

అమరావతి : భారతీయుల జీవన విధానం సేవ, భక్తి, జ్ఞానం అని..వాటినే శ్రీ సత్యసాయిబాబా బోధించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలోశ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ.100 విలువైన స్మారక నాణేన్ని, స్మారక తపాలా బిళ్లల్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రభృతులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు జరుపుకోవటం మనకు ఓ వరం అని, ఆయన పాటించిన ప్రేమ, సేవా భావన ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తోందన్నారు. ఆయన జీవితమే వసుదైవ కుటుంబకం అనే భావనతో నడుస్తోందని, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ.100 నాణెం, తపాలా బిళ్లలను విడుదల చేశాం అని గుర్తు చేశారు. సేవా పరమో ధర్మః అనేని మన మూల జీవన విధానంలోనే ఉందని, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సత్యసాయి బోధించారని, ఆయనతో పాటు ఆయన సంస్థలూ అదే పాటిస్తూ వస్తున్నాయనన్నారు.సమాజం, ప్రజలను నిరంతరం ఆదుకోవటానికి సత్యసాయి నిరంతరం తపించారని కొనియాడారు. బాబా మన మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన స్థాపించిన సంస్థలు గ్రామీణ అభివృద్ధి, ప్రజలకు వైద్యం లాంటి సేవల్ని అందిస్తున్నాయని తెలిపారు. కోట్ల మంది బాబా భక్తులు దేశవ్యాప్తంగా మానవ సేవే మాధవ సేవ అని భావించి సేవలు అందిస్తున్నారన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి ప్రేరణతో అంతా కలిసి పనిచేద్దాం అని, ప్రతీ వ్యక్తి ఆలోచనలో కరుణ, శాంతి, కర్మ అనే విధానాల ద్వారా ముందుకు వెళ్లాలని మోదీ తెలిపారు.

సత్యసాయి సేవాదళ్ సేవలు ప్రశంసనీయం

దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా శ్రీసత్యసాయి సేవా దళ్ సభ్యులు ప్రజలకు సేవలందిస్తున్నారని, భుజ్ భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు నాకు బాగా గుర్తున్నాయ ప్రధాని మోదీ తెలిపారు. తాగునీరు, వైద్యం, విద్య, విపత్తు నిర్వహణ లాంటి వాటిలో సేవాదళ్ సేవలు చిరస్మరణీయమని, 3 వేలకు కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపుల్ని ప్రజలకు దాహార్తి తీర్చారని, వైద్యం ఉచితంగా అందిస్తున్న సంస్థలు బాబా నిర్మించారని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన కోసం వేల మంది బాలికలకు ట్రస్ట్ ఆర్ధికసాయం అందిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్నాయని, రూ.3.25 లక్షల కోట్లకు పైగా నిధులు ఈ ఖాతాల్లో ఉన్నాయని, వారణాసి ఎంపీగా అక్కడ 27 వేల మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద నిధులు జమ చేయించానని మోదీ వెల్లడించారు. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కోసం దేశంలో చాలా పథకాలను ప్రారంభించాం అని, వీటిపై విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు.

గిర్ జాతీ గోవుల పంపిణీ అభినందనీయం

వంద గిర్ జాతి గోవులను శ్రీసత్యసాయి ట్రస్టు పేదవారికి నా చేతుల మీదుగా అందించటం సంతోషిస్తున్నానని మోదీ తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో ఈ గోవుల ద్వారా పెను మార్పు వస్తుందని, రాష్ట్రీయ గోకుల్ మిషన్ లో భాగంగా వారణాసిలో 480కి పైగా గిర్ జాతి ఆవులను పేదవారికి అందించాం అని తెలిపారు. ఇప్పుడు వెయ్యికి పైగా గిర్ ఆవులు ఆ ప్రాంతంలో తయారు అయ్యాయన్నారు. సమీపంలోని రైతులకు పెయ్యలను కూడా ఉచితంగా ఇస్తున్నాం అని తెలిపారు. రువాండాలో 200కు పైగా గిర్ ఆవులు ఉన్నాయని, గోవుల దానం లాంటి సంప్రదాయం అక్కడ కూడా ఉందని గుర్తు చేశారు. గోవుల పోషణతో పాల ఉత్పత్తి, పోషకాహారం, సోషల్ ఇమ్యూనిటీ లాంటివి పెరుగుతాయన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తోందని, వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతున్నానని, స్థానిక ఆర్ధిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉందని మోదీ తెలిపారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ తయారైనట్టేనని స్పష్టం చేశారు.