Mohan Babu | విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు .. మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ద‌క్క‌ని ఊరట‌

Mohan Babu | సినీ నటుడు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో మధ్యంతర రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

  • By: sn |    movies |    Published on : Feb 18, 2026 8:05 AM IST
Mohan Babu | విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు .. మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ద‌క్క‌ని ఊరట‌

Mohan Babu | సినీ నటుడు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో మధ్యంతర రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే క్వాష్ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో ఫోన్ కాల్స్, మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి నివేదిక రావాల్సి ఉందని కోర్టు తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేయాలని కోరిన మోహన్ బాబు తరఫు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

ఈ వివాదం నేపథ్యం చూస్తే, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కొన్ని విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే ధర్నాకు బయలుదేరిన విద్యార్థి సంఘం నేతలు మధ్యలోనే కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ ఘటనపై ఇతర విద్యార్థి సంఘాల నాయకులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకుని విద్యార్థి నాయకులను సురక్షితంగా విడిపించాయి. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే వారు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లని పోలీసులు గుర్తించారు. విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ దశలో రక్షణ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు కిడ్నాప్ ఘటనతో పిటిషనర్‌కు సంబంధం లేదని మోహన్ బాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని, అనంతరం హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారని బోర్డింగ్ పాస్ వివరాలను కోర్టు ముందు ఉంచారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కుట్ర పన్నుతున్నారని, కిడ్నాప్ వెనుక అసలు నిందితులు ఎవరో వెలికితీస్తామని కూడా న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.