Vontimitta: ఒంటిమిట్ట సీతారాములకు.. రూ.6.60 కోట్ల వజ్రాల స్వర్ణ కిరీటాలు

Vontimitta:
విధాత : ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల వజ్రాల స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత పి.ప్రతాప్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. 7 కేజీల బంగారంతో తయారైన మూడు కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో శ్యామలరావులకు అందించారు. పూజల తర్వాత వజ్రాల కిరిటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు.
ఒంటిమిట్ట రామాలయం శుక్రవారం శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇక్కడి రాములోరి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత 2015 సెప్టెంబరు 9న ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు. అభివృద్ధి పనులు, భక్తులకు కావాల్సిన మౌలిక వసతుల కోసం రూ.వంద కోట్లు కేటాయించి టీటీడీ పనులు చేపట్టింది.
నేడు సాయంత్రం 6గంటలకు చంద్రుడి వెన్నెల కాంతుల్లో జరుగనున్న రాములోరి కల్యాణానికి ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. కల్యాణ వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీల్లో 60,000ల మంది స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
కల్యాణ వేదిక వద్ద తలంబ్రాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తలంబ్రాలు, కంకణం, లడ్డూ, అన్నప్రసాదాలు అందించనున్నారు. అదేవిధంగా షెడ్ల వద్ద చలివేంద్రం, పానకం, మజ్జిగ, కూలర్లు ఉండేలా చూస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు తెలిపారు. ఆలయ సమీపంలో క్యూలైన్లలో వెళ్లే భక్తుల కోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. సీతారాముల కల్యాణోత్సవం వీక్షించేలా 23 ఎల్‌ఈడీ స్క్రీన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.