విశాఖపట్నంలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక సింహాచలం గిరి ప్రదక్షిణ వైభవంగా జరుగుతోంది. సూర్యోదయానికి ముందే తొలిపావంచ నుంచే వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే ఈ పవిత్ర ప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 32 కి.మీ మేర జరిగే గిరిప్రదక్షిణకు పలు రాష్ట్రాల నుంచి 6 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు. అప్పన్న తోలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు ప్రదక్షిణకి బయలు దేరుతున్నారు. 32 కిలోమీటర్లు గిరి చుట్టూ తిరిగి రేపు ఉదయానికి అప్పన్న ఆలయానికి చేరుకొనున్నారు.
భక్తుల సౌకర్యార్థం 50 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిరాకరించారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా నేడు, రేపు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ప్రతిఏడాది ఆషాఢ పౌర్ణమి(గురు పౌర్ణమి) పర్వదినం సందర్భంగా అంత్యంత వైభవంగా జరుగుతూ వస్తుంది. ఈ సుదీర్ఘమైన నడక మార్గం గిరి ప్రదక్షిణ కొండ దిగువన ఉన్న ప్రధాన కేంద్రమైన తొలిపావంచా దగ్గర వంశపారంపర్య ధర్మకర్తలతో ప్రారంభమై అడవివరం, హనుమంతవాక, జూపార్కు, అప్పుఘర్ బీచ్, సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం ప్రాంతాల మీదుగా సాగి తిరిగి తొలిపావంచా దగ్గరకు చేరుకుంటుంది. భక్తులు రాత్రంతా నిరంతరాయంగా నడుస్తూ, శ్రీ హరి నామస్మరణతో, భక్తి గీతాలు పాడుకుంటూ ఈ 32 కిలోమీటర్ల గిరి వలయాన్ని చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆ పరమాత్మ స్వయంగా కొలువై ఉన్న సింహగిరి చుట్టూ అత్యంత భక్తితో ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే, అది భూమండలం చుట్టూ ఒక భూప్రదక్షిణ చేసినంత మహా పుణ్య ఫలంతో సమానమని వరాహ పురాణం పేర్కొంది.
పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి రోజున సింహగిరిపై వెలసిన స్వామివారి దివ్యమైన శక్తి, కాంతి కొండంతటా విస్తరిస్తుందనీ, ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భక్తులకు కోటి యజ్ఞాలు చేసినంత అద్భుతమైన ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతపరచడానికి నిరంతరం చందనం పూస్తారు. పౌర్ణమి ఘడియలలో ఆ చందన సువాసనల మధ్య స్వామిని స్మరిస్తూ నడవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయలేని వారు సింహాచలం ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా సరిగ్గా అదే పుణ్యాన్ని పొందవచ్చని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
సింహాచలం గిరిప్రదక్షిణ కోసం తరలివస్తున్న భక్తులు..#SimhachalamGiriPradakshina pic.twitter.com/7vqrYr7iBX
— UttarandhraNow (@UttarandhraNow) July 28, 2026
