AP violence | ఏపీలో ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ముమ్మరం.. నేడు ఈసీకి నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది

విధాత : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. 13 మంది కూడిన బృందం సభ్యులు నాలుగు టీమ్‌లుగా వీడిపోయి పల్నాడు తిరుపతి, అనంతపురం జిల్లాలో శనివారం నుంచి విస్తృతంగా దర్యాప్తును ప్రారంభించారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించి పోలీసులు, స్థానికులు, బాధితుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించారు. వీడియో ఫుటేజీలను పరిశీలించారు.
తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సిట్ సభ్యులు ఆదివారం పరిశీలించారు. నమోదైన 8కేసుల వివరాలను తెలుసుకున్నారు. ధ్వంసమైన వాహనాల వివరాలను సేకరించారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై హత్యాయత్నం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచివారిపల్లిలోనూ సిట్ బృందం పర్యటించింది. టీడీపీ, వైసీపీలకు చెందిన నాయకుల ఇళ్లపై దాడులు జరిగిన విషయాన్ని తెలుసుకుని వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు.
దాడులకు పాల్పడ్డ నిందితులపై నమోదు చేసిన కేసుల గురించి వాకాబు చేశారు. తిరుపతిలో నమోదైన కేసుల సంఖ్య మరింత పెరుగనుండగా, సెక్షన్లు సైతం మారనున్నాయి. కొత్తగా మరికొందరరు నిందితులను కేసుల్లో చేర్చనున్నారు. నరసరావు పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిసి పలు ఫిర్యాదులు చేశారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సిట్ బృందాన్ని వైసీపీ లీగల్ సెల్ సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. నేడు ఉదయం సిట్ టీం చీఫ్ వినీత్ బ్రిజల్ కు అందించనుండగా, ఆయన ఈసీకి నివేదిక ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు.