భారీ మెజార్టీతో కూటమిదే గెలుపు.. చంద్రబాబు
పీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలువబోతుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ విడుదల, మంగళవారం కౌంటింగ్ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు

విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలువబోతుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ విడుదల, మంగళవారం కౌంటింగ్ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా హజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు కూటమిని ఆదరించారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయన్నారు.
ఎన్నికలలో విజయం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భేషజాలు పక్కన పెట్టి సమష్టిగా కృషి చేశారని అభినందించారు. కౌంటింగ్ రోజున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ రోజున వైసీపీ విద్వేశాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ పార్టీ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తోందని, కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి నియోజవర్గ పరిధిలో కూటమి నేతలు తమ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జగన్ తిరకాసు పెట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. అందుకే, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయం సాధించిన తరువాత డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు.