Vande Bharat | ఏపీకి మరో వందే భారత్‌ రైలు.. దుర్గ్‌ టూ విశాఖ రూట్‌ ఫిక్స్‌..!

Vande Bharat | ఏపీకి మరో వందే భారత్‌ రైలు.. దుర్గ్‌ టూ విశాఖ రూట్‌ ఫిక్స్‌..!

Vande Bharat | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో పది వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ముందు గతేడాది చివరలో ఆరు వందే భారత్‌ రైళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తాజాగా మరో రూట్‌లో వందే భారత్‌ రైలు పరుగులు తీయనున్నది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడువనున్నది. రైలు కోసం పూర్తిస్థాయిలో రైల్వేశాఖ సన్నాహాలు చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రైలును ప్రారంభించలేదు. ఈ రైలును జూన్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ వందే భారత్‌ రైలును నడిపించాలని రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు. ఈ క్రమంలో దుర్గ్‌-విశాఖపట్నం రూట్‌లో సెమీ హైస్పీడ్‌ రైలుకు రైల్వేశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

దాంతో పాటు రైలుకు సంబంధించిన టైం టేబుల్‌ను సైతం సిద్ధం చేశారు. సమాచారం మేరకు.. వందే భారత్‌ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.50 గంటలకు దుర్గ్‌ చేరుతుంది. రెండు నగరాల మధ్య ఎనిమిదిన్నర గంటలు మాత్రమే ప్రయాణ సమయం పడుతుంది. ఇదిలా ఉండగా.. భారతీయ రైల్వే త్వరలోనే వందే భారత్‌ స్లీపర్‌ రైలును సైతం పట్టాలెక్కించబోతున్నది. లోక్‌సభ ఎన్నికల తర్వాత స్లీపర్‌ రైలును యూపీలో నడిపించనున్నట్లు తెలుస్తున్నది. గోరక్‌పూర్‌ – ఆగ్రా మధ్య నడువనున్నట్లుసమాచారం. ఆ తర్వాత రైలును ఢిల్లీ వరకు విస్తరించనున్నట్లు తెలుస్తున్నది. స్లీపర్ వందే భారత్ రైలు గోరఖ్‌పూర్ నుంచి లక్నో, ఐష్‌బాగ్-కాన్పూర్ మీదుగా ఆగ్రా వరకు నడుస్తుంది. గోరఖ్‌పూర్-ఆగ్రా వందే భారత్ స్లీపర్ రైలుకు 22583-22584 నంబర్లను సైతం రైల్వేశాఖ కేటాయించినట్లు తెలుస్తున్నది.