అమరావతి :ఆంధ్రప్రదేశ్ సాగు,తాగునీటి వనరుల విస్తరణలో కీలక మైలురాయి, మూడు దశాబ్దాల కల.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ -1ను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కృష్ణా నదికి చీర సారే సమర్పించి జల హారతి ఇచ్చి…ప్రాజెక్టు పైలాన్ ను చంద్రబాబు ఆవిష్కరించారు. నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ కు నీటిని విడుదలచేశారు.వెలిగొండ ఫీడర్ కాలువ 4.2 కి.మీ. వద్ద ఉన్న క్రాస్ రెగ్యులేటర్ వద్దకు శ్రీశైలం జలాశయంలోని కొల్లంవాగు నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలకు చంద్రబాబు జలహారతి ఇచ్చి క్రాస్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి, నీటిని నల్లమలసాగర్ జలాశయానికి నీటి విడుదల చేశారు. అనంతరం కొద్ది దూరంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.
4లక్షల ఎకరాలకు సాగునీరు..23లక్షల మందికి తాగునీరు
వెలిగొండ ప్రాజెక్టులో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరువు ప్రాంతాలు కొత్త జలకళ సంతరించుకోనున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా వచ్చే కృష్ణా జలాలతో ఆయా జిల్లాల పరిధిలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు,23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది. 1996లో మార్చి 5న చంద్రబాబు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టులను 30 ఏళ్ల తర్వాతా ఆయన చేతుల మీదుగా ప్రారంభించండి జాతికి అంకితం కావడం చరిత్రాత్మక ఘట్టమని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. “వెలిగొండ జలసిరులు – అభివృద్ధి రెక్కలు…” అని అభివర్ణించింది.
నల్లమల సాగర్ రిజర్వాయర్ కీలకం..
వెలిగొండ ప్రాజెక్టులో నల్లమలసాగర్ జలాశయంలో 53.85 టీఎంసీల నీరు నిల్వ సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 10.70 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఈ జలాశయం నుంచి మూడు కాలువలు ఉన్నాయి. తీగలేరు కాలువ 48.30 కిలోమీటర్ల దూరం తవ్వారు. దీని కింద 62,000 ఎకరాల ఆయకట్టు ఉంది. గొట్టిపడియ కాలువ 11.40 కిలోమీటర్లు తవ్వారు. దీని పరిధిలో 9,500 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పు ప్రధాన కాలువ మొత్తం 130.85 కి.మీ. దూరం. తొలి దశలోకి 44వ కిలోమీటరు వరకు ఆయకట్టు మాత్రమే వస్తుండటం గమనార్హం. గొట్టిపడియ కింద డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యాయి. తొలి దశలో 1లక్ష 19వేల ఎకరాలకు ఆయకట్టుకే పరిమితం కానుంది. రెండో దశ పూర్తయితే 3లక్షల 28,300ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.
తొలిదశలో రూ.950 కోట్లతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. వాటి నిర్మాణం పూర్తయితేనే సాగుకు నీరందుతుంది. జలజీవన్ మిషన్ కింద 5 నియోజకవర్గాలకు ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు 1.75 టీఎంసీలు సరఫరా చేసేలా పథకం సిద్ధమవుతోంది. 2027 మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలని ప్రణాళికగా పెట్టుకున్నారు. రెండో దశలో రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల నిర్మాణ పనులు కొంత జరిగాయి. వాటన్నింటిని పూర్తి చేస్తేనే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరనుంది.
వెలిగొండ ప్రాజెక్టు.. పూర్తయిన 30 ఏళ్ల స్వప్నం. #VeligondaProject pic.twitter.com/6lJCWmVXnV
— N Chandrababu Naidu (@ncbn) August 30, 2026
