చంద్రబాబు, రేవంత్‌ల భేటీపై వైసీపీ మాజీ మంత్రుల రచ్చ

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలు ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

చంద్రబాబు, రేవంత్‌ల భేటీపై వైసీపీ మాజీ మంత్రుల రచ్చ

పారదర్శకత కోసం ప్రత్యక్ష ప్రసారం చేయాలి : బొత్స
విభజన సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల పునరేకీకరణనే మార్గం : పేర్ని నాని

విధాత, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలు ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొలిసారిగా జరిగిన భేటీ ఏపీలో టీడీపీ కూటమి పార్టీలకు, వైసీపీలకు మధ్య మాటల యుద్దాన్ని రగిలించింది. ఏపీ, తెలంగాణల సీఎంల భేటీపై మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఇద్దరు సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలని సూచించారు.

సీ పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటాల అంశం ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని సూచించారు.బొత్స చేసిన ఈ పోస్టు వైరల్‌గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. “తెలుగు న్యూస్ చానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణి ఏకైక మార్గంగా కనిపిస్తోంది!” అంటూ ట్వీట్ చేశారు.

కాగా సీఎంల భేటీపై ఏపీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చూశారని విమర్శించారు. విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. ఇప్పుడు విభజన సమస్యలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చర్చలు జరపడం అభినందనీయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిందని వ్యాఖ్యలు చేశారు.