YS Jagan | ఢిల్లీ వేదికగా కూటమి ప్రభుత్వ దాడులపై పోరాటం: వైసీపీ అధినేత జగన్
ఏపీలో హింసాత్మక ఘటనలపైన, వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత చర్యలపైన ఢిల్లీ వేదికగా గళమెత్తాలని, రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు

విధాత, హైదరాబాద్: ఏపీలో హింసాత్మక ఘటనలపైన, వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అణిచివేత చర్యలపైన ఢిల్లీ వేదికగా గళమెత్తాలని, రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శనివారం జరిగిన వైసీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో జగన్ మాట్లాడారు. వైసీపీ నేతలపై దాడులకు వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పార్లమెంటు సమావేశాల్లో చర్చకు డిమాండ్ చేయాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించారు. రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని సూచనలు చేశారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్లు కోరానని జగన్ తెలిపారు. ఈ నెల 24న ధర్నా చేసే రోజే వారిని కలిసేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీలకు సూచించారు. ధర్నాకు కలిసొచ్చే పార్టీలను పిలవాలన్నారు. మన పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపించేలా మన పోరాటాలు ఉండాలని, పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్టపడదని తెలిపారు. రాష్ట్రంలోని హింసాత్మక పరిస్థితులపై అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుతామని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై వైసీపీ లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 15 మంది ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.