ఏపీ వెనుకబాటుకు వైసీపీ, టీడీపీ పార్టీలు రెండూ కారణమే

ఆంధ్రప్రదేశ్‌ వెనుకబాటుకు వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కారణమేనని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో దొందూ దొందేనని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌.షర్మిల అన్నారు

ఏపీ వెనుకబాటుకు వైసీపీ, టీడీపీ పార్టీలు రెండూ కారణమే
  • అప్పుల్లో దొందూ దొందే
  • ప్రజలపై 10లక్షల కోట్ల అప్పుల భారం
  • అయినా రాజధాని కూడా కట్టలేదు
  • పదేళ్లుగా ప్రత్యేక హోదా తేలేదు
  • స్వలాభాల కోసం బాబు, జగన్‌లు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
  • బీజేపీ చెప్పినట్లుగా చేస్తున్నారు
  • హోదా..రాజధానిల పాపం బాబు, జగన్‌లదే
  • వైఎస్‌.షర్మిల ధ్వజం
  • ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ

విధాత, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వెనుకబాటుకు వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కారణమేనని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో దొందూ దొందేనని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌.షర్మిల అన్నారు. ఆదివారం ఆమె విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. పార్టీలోకి తాను రావాలని కాంగ్రెస్‌ కేడర్ కోరుకుందని, వారందరికీ వైఎస్ బిడ్డగా తాను తల వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. షర్మిల ప్రసంగం సమయంలో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకంపై ఏఐసీసీ తీర్మానాన్ని గిడుగు రుద్రరాజు చదివి వినిపించారు. బాధ్యతల స్వీకరణ అనంరతం షర్మిల మాట్లాడుతూ గత పదేళ్లలో ఆ వైసీపీ, టీడీపీ పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న అప్పు రూ. 1లక్ష కోట్లుగా ఉండగా, చంద్రబాబు రూ. 2లక్షల కోట్ల అప్పులు చేస్తే, ప్రస్తుత సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రూ.3లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని విమర్శించారు. కార్పొరేషన్ రుణాలు, ఇతర బకాయిలు అన్నీ కలిపితే రూ.10లక్షల కోట్ల భారం రాష్ట్రంపై ఉందన్నారు. ఇంత అప్పు చేసినా రాష్ట్ర అభివృద్ధి జరిగిందా? అని బూతద్దంలో వెతికినా కనిపించదన్నారు. రాష్ట్రానికి రాజధాని ఉందా? విజయవాడలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఈ పదేళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? కనీసం ఒక్క మెట్రో కూడా నిర్మాణం చేయలేదని మండిపడ్డారు. రోడ్లు వేసుకోవడానికి కూడా నిధుల్లేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని, అభివృద్ధి జరగడం లేదని, దళితులపై దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయని, ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాపియా దోచుకోవడం.. దాచుకోవడం అన్నట్లుగా సాగుతుందన్నారు.

ప్రత్యేక హోదాను మరిచిన పార్టీలు

రాష్ట్రానికి విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా రావాల్సివుందని, దాని సాధనకు పోరాడాల్సిన టీడీపీ, వైసీపీలు ఆ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రానికి నేడు ప్రత్యేకహోదా కాదు కదా.. ప్యాకేజీ కూడా లేదని, ఈ పాపం జగన్, చంద్రబాబులదేనన్నారు. ప్రత్యేక హోదా రాలేదనేకంటే పాలకులు తేలేకపోయారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు రావడంతో పాటు పన్ను రాయితీలు, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. హోదా కోసం చంద్రబాబు ఉద్యమించలేదని, ఉద్యమించిన వాళ్లను జైల్లో పెట్టారని, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేకహోదా కోసం నిరాహారదీక్షలు కూడా చేశారని, సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ఆయన హోదా డిమాండ్‌ను మరిచిపోయారన్నారు. బాబు, జగన్‌ ఇద్దరూ స్వంత లాభాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని షర్మిల ఆరోపించారు.

బీజేపీ చేతుల్లోనే ఆ రెండు పార్టీలు

22 మంది వైసీపీ ఎంపీలు, ముగ్గురు టీడీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ చేతుల్లో ఉన్నారని, బీజేపీ ఏం చేబితే ఆ రెండు పార్టీలు అదే చేస్తున్నాయని షర్మిల విమర్శించారు. 10లక్షల కోట్ల అప్పులు చేసినా రాష్ట్రానికి పదేళ్లలో ఇద్దరు సీఎంలు రాజధాని కట్టలేకపోయారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాం పూర్తి చేయని చంద్రబాబు డిజిటల్‌ మాయ చేశారన్నారు.

జగన్ మూడు రాజధానులని చెప్పి ఒక్కటి కట్టలేదన్నారు. రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు పనులు చాలా వరకు పూర్తయ్యాయని చెపుకొచ్చారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయారని, అప్పులేని రైతు ఉన్నారా అన్న సందేహాం నెలకొందని, రైతుల ఆత్మహత్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

ఏపీపై బీజేపీ కపట ప్రేమ

బీజేపీ ఏపీపై కపట ప్రేమ చూపించడమే తప్ప.. చేసిందేమీ లేదని షర్మిల మండిపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు అన్న బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. నేడు అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా చూపించాలని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలపై ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనం మొత్తం తీసుకువస్తామని మోదీ చెప్పలేదా.. ఎంత తెచ్చారు.. పేదల చేతుల్లో ఎంత పెట్టారని ప్రశ్నించారు. ఇంత మోసం చేసిన బీజేపీనీ ఎలా నమ్మాలని నిలదీశారు.