నాగుపామును ముప్పుతిప్పలు పెట్టిన మూడు కుక్కలు.. వీడియో
ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన ఓ నాగుపామును మూడు కుక్కలు ముప్పుతిప్పలు పెట్టాయి. పడగ విప్పి బుసలు కొడుతున్న నల్ల నాగుపామును ఓ ఆట ఆడుకున్నాయి శునకాలు.

లక్నో : నాగుపాములు జనవాసాల్లోకి రావడం సహజం. ఆ పాములను గమనించిన వెంటనే.. జనాలు వాటిని చంపేస్తుంటారు. లేదంటే పాములు పట్టే వ్యక్తులకు సమాచారం అందింస్తుంటారు. అయితే ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన ఓ నాగుపామును మూడు కుక్కలు ముప్పుతిప్పలు పెట్టాయి. పడగ విప్పి బుసలు కొడుతున్న నల్ల నాగుపామును ఓ ఆట ఆడుకున్నాయి శునకాలు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ శ్రవస్తి గ్రామంలోని ఇకౌనా ఏరియాలోకి నలుగు రంగులో ఉన్న నాగుపాము ప్రవేశించింది. ఓ ఇంటి ఆవరణలో ప్రత్యక్షమైన ఆ నాగుపామును అక్కడే ఉన్న మూడు కుక్కలు గమనించాయి. ఇక దీంతో ఆ కుక్కలు గట్టిగా అరుస్తూ, పామును ఊపిరి తీసుకోనివ్వలేదు. ఓ కుక్క అయితే పాము పడగపై దాడి చేసేందుకు యత్నించగా, మరో కుక్క దాని తోకను పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఇక మూడో కుక్క కొంచెం దూరంలో ఉంది. అలా మూడు కుక్కలు పామును ముప్పుతిప్పలు పెట్టాయి.
ఇక నాగుపామును చూసిన ఓ మహిళ ఇంటి ఆవరణలోని ఓ మూలన నిలబడింది. ఆమె అటు ఇటు కదలకుండా అలానే ఉండిపోయింది. బయటకు రావాలని అక్కడున్న ఓ వ్యక్తి సూచించినప్పటికీ ఆమె కదల్లేదు. కుక్కలు మొరగడంతో అక్కడికి పెద్ద ఎత్తున జనాలు చేరుకుని, నాగుపామును చూసేందుకు ఆసక్తి చూపించారు.