మధ్యప్రదేశ్‌లో దుమ్మురేపిన ఓటర్లు.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి చరిత్రలోనే లేనంత అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్‌లో దుమ్మురేపిన ఓటర్లు.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌..
  • 76.22 శాతం ఓటింగ్‌ నమోదు
  • ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం
  • అగ్రస్థానంలో సియోనీ జిల్లా
  • పనిచేయని మావోయిస్టుల ప్రయత్నాలు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ఓటర్లు నిరుపమానమైన చైతన్యాన్ని ప్రదర్శించారు. శుక్రవారం 230 నియోజకవర్గాలకు నిర్వహించిన పోలింగ్‌లో ఏకంగా 76.22 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడిన 1956 నుంచి చూస్తే.. ఇదే అత్యధిక ఓటింగ్‌ శాతం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 75.63 శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. ఈసారి దానికంటే 0.59 శాతం పెరగటం విశేషం. తూర్పు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో అత్యధికంగా 85.68 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


పశ్చిమ ప్రాంతంలోని గిరిజనులు అత్యధికంగా ఉండే అలీరాజ్‌పూర్‌లో కనిష్ఠంగా 60.10శాతం ఓటింగ్‌ నమోదైందిన అధికారులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే మహారాష్ట్ర పొరుగు ప్రాంతమైన బాలాఘాట్‌ జిల్లా 85.23 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఎన్నికల్లో పాల్గొనవద్దని మావోయిస్టులు హెచ్చరికలు చేసినా, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు రహదారులను దిగ్బంధించినా.. ప్రజలు మాత్రం బుల్లెట్‌ కంటే.. బ్యాలెట్‌ గొప్పదని చాటడం విశేషం.


ఇటీవలి కాలంలో ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఓటింగ్‌ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2003లో 67.25 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2008 నాటికి అది 69.78 శాతానికి పెరిగింది. 2013లో 72.13 శాతానికి, 2018లో 75.63 శాతానికి చేరుకున్నది. 2003 నుంచి బీజేపీ మూడుసార్లు విజయం సాధించగా.. కాంగ్రెస్‌ ఒక దఫా గెలుపొందింది. 2003 ఎన్నికల్లో బీజేపీ 42.50 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 31.70 శాతం ఓట్లు లభించాయి. బీఎస్పీ, ఇతరులు 10.61 శాతం ఓట్లు సాధించాయి. 173 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కు 38, బీఎస్పీకి 2 సీట్లు లభించాయి. 2008 ఎన్నికల్లో బీజేపీ 143 సీట్లకు తగ్గింది. కాంగ్రెస్‌ 71 సీట్లలో గెలిచింది. బీఎస్పీ, ఇతర పార్టీలు మిగిలిన సీట్లలో గెలుపొందాయి. 2013లో బీజేపీ 165 సీట్లు, కాంగ్రెస్‌ 58 సీట్లు గెలిచాయి. 2018లో బీజేపీ 109 స్థానాల్లో , కాంగ్ర ఎస్‌ 114 సీట్లలో గెలుపొందాయి.


బీఎస్పీ, ఎస్పీ, ఇతరుల సహాయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినా.. 2020 మార్చిలో బీజేపీ కుట్రతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవదీయడంతో ప్రభుత్వం కుప్పకూలి.. తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా మంత్రివర్గంలో సింధియా వర్గానికి కీలక పదవులు లభించాయి. సింధియా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయ్యారు. తాజాగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,533 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి, స్వతంత్రంగా బరిలో నిలిచారు.