జుట్టు కత్తిరించుకోవాలని మందలింపు.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తరగతులకు సరిగా హాజరు కాని ఓ విద్యార్థిని పట్టుకుని, జుట్టు కత్తిరించుకోవాలని అధ్యాపకుడు మందలించాడు. దీంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.

హైదరాబాద్ : తరగతులకు సరిగా హాజరు కాని ఓ విద్యార్థిని పట్టుకుని, జుట్టు కత్తిరించుకోవాలని తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి(19) అనురాగ్ యూనివర్సిటీలో సీఎస్ఈ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇటీవల వెల్లడైన సెమిస్టర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు. దీంతో గత మూడు రోజుల నుంచి అధ్యాపకుడు వీఎస్ రావు.. జ్ఞానేశ్వర్ రెడ్డికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కటింగ్ చేయించుకొని తరగతులకు హాజరు కావాలని సూచించారు. బుధవారం కూడా ఇదే విషయం చెప్పారు. తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడని జ్ఞానేశ్వర్ తీవ్ర అవమానానికి గురయ్యాడు.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం యూనివర్సిటీ రెండో అంతస్తు నుంచి విద్యార్థి కిందకు దూకేశాడు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జ్ఞానేశ్వర్ రెడ్డి సోదరుడు సాత్విక్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.