Coimbatore Gang Rape | విద్యార్థినిపై అత్యాచారం..నిందితులపై పోలీస్ కాల్పులు

కోయంబత్తూరులో విద్యార్థినిపై అత్యాచారం కలకలం.. నిందితులపై పోలీస్ కాల్పులు, ముగ్గురిని సజీవంగా అదుపులోకి తీసుకున్నారు.

Coimbatore Gang Rape | విద్యార్థినిపై అత్యాచారం..నిందితులపై పోలీస్ కాల్పులు

విధాత : విమానాశ్రయం సమీపంలో తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద స్నేహితుడితో కలిసి కారులో కూర్చుని కళాశాల విద్యార్థిని మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్ధకు వచ్చారు. వారితో వాగ్వాదానికి దిగి దాడికి దిగారు. కొడవలితో ఆ యువకుడిపై దాడి చేశారు. అతను తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోగానే.. దుండగులు ఆ విద్యార్థినిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి, నిర్జన ప్రాంతంలో వదిలేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన యువకుడు జరిగిన సంఘటనపై తన సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.

పిళమేడు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువతి యువకులను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామను ముగ్గురు నిందితుల ఆచూకి పోలీసులు కనిపెట్టారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయబోగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారి కాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులు వారిని సజీవంగా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి ముందుగా వారిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిపై అత్యాచారం ఘటనను నిరసిస్తున్న తమిళనాడులోని ప్రతిపక్షాలు అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి.