Rolex Wild Elephant : రాత్రి దొంగ..అడవి ఏనుగు చిక్కింది!

కోయంబత్తూరులోని తొండముత్తూరు అటవీ ప్రాంతంలో పంటలు ప్రజలకు నష్టం కలిగించిన 'రోలెక్స్' అనే మగ ఏనుగును అటవీ అధికారులు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. దానిని మూడు కుంకీ ఏనుగుల సహాయంతో శిబిరానికి తరలించారు.

Rolex Wild Elephant : రాత్రి దొంగ..అడవి ఏనుగు చిక్కింది!

విధాత: అసలే అది భారీ అడవి ఏనుగు..దానికి ఎదురెళ్లే సాహసం చేసిన వారిని చంపేస్తుంది. అందులో రాత్రి పూట మాత్రమే అడవి నుంచి గ్రామాల్లోకి చొరబడి పంటలను నాశనం చేయడం, అడ్డొచ్చిన మనుషులను చంపడం అలవాటుగా పెట్టుకుంది. దీంతో ఆ ప్రాంత గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఆ దొంగ ఏనుగు. చివరకు అటవీ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు చిక్కింది. వివరాల్లోవి వెళితే కోయంబత్తూర్ జిల్లా తొండముత్తూర్ అటవీ ప్రాంతంలోని అడవి నుండి రోలెక్స్ అని పిలువబడే మగ అడవి ఏనుగు తరచుగా అడవి నుంచి బయటకు వచ్చి..సమీప గ్రామాల్లో పంట నష్టం, ప్రాణనష్టం కలిగిస్తోంది. ఈ ఏనుగు ప్రతి రాత్రి అడవి నుండి బయటకు వస్తు నిత్యం తన విధ్వంసాన్ని కొనసాగిస్తుంది.

దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఏనుగు కదలికలపై కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. అది ఎక్కడెక్కడ సంచరిస్తుంది..రాత్రివేళ గ్రామాల్లోకి ఎప్పుడు వస్తుందన్నదానిపై నిరంతరం నిఘా వేశారు. దొంగ ఏనుగును బంధించేందుకు పక్కా ప్లాన్ అమలు చేశారు. యధాప్రకారం రాత్రి వేళ గ్రామ పొలాల్లోకి చొరబడిన ఏనుగుకు అక్టోబర్ 17న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మత్తుమందు ఇచ్చి నియంత్రణలోకి తెచ్చారు. మూడు కుంకీ ఏనుగులు (కపిల్‌దేవ్, వాసిం, బొమ్మన్) సహాయంతో దొంగ ఏనుగును లారీలో ఎక్కించి వరకాలియార్ ఏనుగుల శిబిరానికి తరలించారు. నెలల తరబడి తమను ముప్పుతిప్పలు పెట్టిన అడవి ఏనుగు పట్టుబడటంతో అక్కడి గ్రామాల ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.