సార్..మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు : కలెక్టర్ ను అడిగిన విద్యార్ధి

కలెక్టర్ సందర్శనలో విద్యార్థి ధైర్యంగా “మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్” అని అడిగితే కలెక్టర్ స్పందించి వివరాలు తెలుసుకున్నారు.

సార్..మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు : కలెక్టర్ ను అడిగిన విద్యార్ధి

విధాత : తన పాఠశాలకు వచ్చిన జిల్లా కలెక్టర్ ను ఓ విద్యార్థి సార్.. మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ ప్రశ్నించిన ఘటన ఆసక్తి రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను కలెక్టర్ హనుమంత రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా టీచర్ల పనితీరు, విద్యాబోధన, విద్యార్థులకు అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజనం, ఇతర సమస్యలపై కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకి ఇచ్చే ఆహారంలో సరిపడా పప్పు , కూరగాయలు ఎక్కువగా లేవని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో జరిగిన వాలీబాల్ పోటీల్లో బాలుర, బాలికల టీమ్ లు 1,2 పతకాలు సాధించినందుకు విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్.క్రీడల్లో లాగా చదువులో కూడా సత్తా చాటాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన ఆహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించేలా టీచర్లు, విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కీర్తి కుమార్ అనే ఓ విద్యార్థి కలెక్టర్ హనుమంతరావు వద్దకు వెళ్లి మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని..ఇల్లు కావాలంటూ అడిగాడు. తన వద్దకు వచ్చి నేరుగా ఇందిరమ్మ ఇంటికోసం ప్రశ్నించిన విద్యార్థి కీర్తి కుమార్ ధైర్యాన్ని మెచ్చుకున్న కలెక్టర్ అతడిని అభినందించారు. వెంటనే ఎంపీడీఓతో మాట్లాడి కీర్తి కుమార్ తల్లిదండ్రులకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంపై వివరాలు తెలుసుకున్నారు. కీర్తి కుమార్ కుటుంబానికి సొంత స్థలం లేకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదని ఎంపీడీవో కలెక్టర్ కు వివరించారు.