చండీగ‌ఢ్‌లో బీజేపీ డ‌బుల్ గేమ్‌! అసలు ట్విస్ట్ ఏమిటంటే..

చండీగఢ్ మేయర్ పదవికి సోన్కర్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే ముగ్గురు ఆప్ కౌన్సిలర్లను బీజేపీ తన శిబిరంలోకి చేర్చుకున్నది.

చండీగ‌ఢ్‌లో బీజేపీ డ‌బుల్ గేమ్‌! అసలు ట్విస్ట్ ఏమిటంటే..
  • మేయ‌ర్ ప‌ద‌వికి సోన్‌కర్ రాజీనామా
  • బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిల‌ర్లు

చండీగ‌ఢ్‌: బీజేపీ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు అంతూ పొంతూ లేకుండా పోయింది. ఇటీవ‌ల దొడ్డిదారిలో చండీగ‌ఢ్ మేయ‌ర్ పీఠాన్ని కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డిన బీజేపీ.. ఇప్పుడు ప్ర‌లోభాల‌తో ఆ పీఠాన్ని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ది. పైకి మాత్రం సుప్రీంకోర్టు విచార‌ణ‌ నేప‌థ్యంలో మేయ‌ర్ మ‌నోజ్ సోన్‌క‌ర్ రాజీనామా చేసినా.. మ‌రోవైపు ముగ్గురు ఆప్ కౌన్సిల‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్న‌ది. మేయ‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ఆదివారం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు సోన్‌క‌ర్ లేఖ అందించారు. ఇది త‌మ‌కు క‌లిసొచ్చే ప‌రిణామ‌మ‌ని ఆప్ ఆనంద‌ప‌డే లోపే ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిల‌ర్లు గుర్‌చ‌ర‌ణ్‌జీత్ సింగ్ కాలా, నేహా, పూనందేవి.. బీజేపీ శిబిరంలో చేరిపోయారు. ఇప్ప‌టి దాకా బీజేపీని వ్య‌తిరేకించిన ఈ ముగ్గురు కౌన్సిల‌ర్ల‌కు ఉన్న‌ట్టుండి ప్ర‌ధాని మోదీ గొప్ప‌త‌నం తెలిసివ‌చ్చిన‌ట్టుంది. తాము మోదీ చేస్తున్న ప‌నుల‌తో స్ఫూర్తి పొంది బీజేపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆప్ త‌ప్పుడు హామీలు ఇస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఆప్‌లో వారికి త‌గినంత గౌర‌వం ల‌భించ‌నందునే బీజేపీలో చేరుతున్నార‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వినోద్ తాడ్వే అన్నారు. వారి నిర్ణ‌యాన్ని బీజేపీ గౌర‌విస్తున్న‌ద‌ని, వారి స‌హ‌కారంతో చండీగ‌ఢ్‌ను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు.


జ‌న‌వ‌రి 30వ తేదీన జ‌రిగిన చండీగ‌ఢ్ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-ఆప్ అల‌యెన్స్‌ను ఓడించి బీజేపీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పేప‌ర్ల‌ను ట్యాంప‌ర్ చేశార‌ని ఆరోపిస్తూ ఆప్ న్యాయ‌పోరాటానికి దిగింది. బ్యాలెట్ ప‌త్రాల్లో మార్పులు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తున్న సీసీ టీవీ ఫుటేజ్‌ను కూడా ఆప్.. సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. దీనిని ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.. ఇది ప్ర‌జాస్వామ్యాన్ని హ‌త్య చేయ‌డ‌మేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.