Bottle Gourd | పొట్లకాయతో పోటీపడ్డ సొరకాయ.. పొడవు ఎంతంటే..?

Bottle Gourd | కొన్ని సందర్భాల్లో కూరగాయలు.. తమ సాధారణ పరిమాణం కంటే.. అధిక పరిమాణంలో పెరుగుతుంటాయి. ఆ జాబితాలో సొరకాయ, వంకాయ, బీరకాయ వంటి కూరగాయలు ఉంటాయి. అయితే ఈ సొరకాయలు కూడా పొట్టకాయతో పోటీ పడ్డాయి. పొట్లను మించి సొరకాయలు పొడవుగా పెరిగాయి. ఒక్కో సొరకాయ ఆరు అడుగుల పైనే ఉంది. ప్రస్తుతం ఈ సొరకాయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ముత్యాల సత్తిరాజు తన ఇంటి ఆవరణలో కూరగాయలు పెంచుకుంటున్నారు. హైదరాబాద్‌లో తన స్నేహితుడి వద్ద నుంచి సొర విత్తనాలు, 3 నెలల క్రితం తీసుకొచ్చి నాటారు. సేంద్రియ పద్దతుల్లో ఈ మొక్కలను పెంచారు. ఇక సొర తీగలు పందిరికి అల్లుకుపోయాయి. పొట్ల కాయల మాదిరిగా సొరకాయలు పెరిగాయి. ఆరు అడుగులకు పైగా పెరిగిన ఆ సొరకాయలు రైతులను, స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. నేల స్వభావం, పోషకాల ఆధారంగా 6 నుంచి 8 అడుగుల వరకూ సొరకాయలు పెరుగుతాయని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కరుణ శ్రీ తెలిపారు.