Buffalo swallows Gold | మంగ‌ళ‌సూత్రాన్ని మింగేసిన బ‌ర్రె.. 2 గంట‌ల పాటు స‌ర్జ‌రీ

Buffalo swallows Gold | మంగ‌ళ‌సూత్రాన్ని మింగేసిన బ‌ర్రె.. 2 గంట‌ల పాటు స‌ర్జ‌రీ

Buffalo swallows Gold | దాణాతో పాటు మంగ‌ళసూత్రాన్ని మింగేసింది ఓ బ‌ర్రె. మంగ‌ళ‌సూత్రాన్ని బ‌ర్రె మింగేసింద‌ని గ్ర‌హించిన అనంత‌రం దానికి 2 గంట‌ల పాటు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. బ‌ర్రె క‌డుపులో ఉన్న మంగ‌ళ‌సూత్రాన్ని విజ‌య‌వంతంగా బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని వ‌సీం జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. వ‌సీం జిల్లాకు చెందిన ఓ మ‌హిళ స్నానానికి వెళ్లే ముందు.. బ‌ర్రె దాణా ఉన్న ప‌ల్లెంలో మంగ‌ళ‌సూత్రాన్ని ఉంచింది. స్నానం చేసివ‌చ్చిన త‌ర్వాత మంగ‌ళ‌సూత్రాన్ని దాణాలో దాచిపెట్టిన విష‌యాన్ని ఆమె మ‌రిచిపోయి, ఆ ప‌ల్లెంను బ‌ర్రె ముందు ఉంచింది. దీంతో బ‌ర్రె దాణాతో పాటు మంగ‌ళ‌సూత్రాన్ని మింగేసింది. కాసేప‌టి త‌ర్వాత మ‌హిళ‌కు మంగ‌ళసూత్రం గుర్తొచ్చింది. ఆ బంగారు గొలుసు కోసం వెత‌క‌గా, బ‌ర్రె మింగేసిన‌ట్లు గ్ర‌హించింది. ఆ మంగ‌ళ‌సూత్రం విలువ రూ. 1.5 ల‌క్ష‌లు కాగా, 20 గ్రాముల బ‌రువు ఉంది.

ఇక విష‌యాన్ని త‌న భ‌ర్త దృష్టికి తీసుకెళ్లింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా భ‌ర్త.. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ల‌కు స‌మాచారం అందించాడు. బ‌ర్రెను మెట‌ల్ డిటెక్ట‌ర్‌తో వైద్యులు ప‌రిశీలించి, బంగారం ఎక్క‌డ ఉందో గుర్తించారు. అనంత‌రం బ‌ర్రెకు 2 గంట‌ల పాటు స‌ర్జ‌రీ నిర్వ‌హించి, మంగ‌ళ‌సూత్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. స‌ర్జ‌రీతో బ‌ర్రెకు 60 నుంచి 65 కుట్లు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం బ‌ర్రె ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.