హీరోయిన్స్‌కి ల‌క్కీ హీరోగా మారిన చంద్ర మోహ‌న్.. తొలుత రెండు సార్లు హీరోగా ఛాన్స్ మిస్

  • By: sn |    breaking |    Published on : Nov 11, 2023 6:42 AM IST
హీరోయిన్స్‌కి ల‌క్కీ హీరోగా మారిన చంద్ర మోహ‌న్.. తొలుత రెండు సార్లు హీరోగా ఛాన్స్ మిస్

సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ ఈ రోజు ఉద‌యం అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. గత కొంతకాలంగా మధుమేహంతో బాధ‌ప‌డుతున్న చంద్ర‌మోహ‌న్ డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. అయితే ఈ రోజు తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న ఉద‌యం 9.45ని.ల‌కి తుది శ్వాస విడిచారు. 82 ఏళ్ల వ‌య‌స్సులో చంద్ర‌మోహ‌న్ క‌న్నుమూయ‌డంతో టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ శోక సంద్రంలో మునిగింది. చంద్ర‌మోహ‌న్ హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన విశేష ప్రేక్షకాదరణ పొందారు.కొత్త నిర్మాత‌ల‌తో పాటు హీరోయిన్స్‌కి చంద్ర‌మోహ‌న్ ఓ వ‌రంలా మారారు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన హీరోయిన్స్ త‌ప్ప‌క చంద్ర‌మోహ‌న్ తో ఓ సినిమా చేయాల‌ని అనుకుంటారు. అందుకు కార‌ణం ఆయ‌నతో సినిమా చేస్తే వారికి తిరుగు ఉండ‌దనే సెంటిమెంట్ ఏర్ప‌డింది. చంద్ర‌మోహ‌న్ హీరోగా వ‌చ్చిన సిరిసిరిమువ్వ‌లు (1976) సినిమాలో జ‌య‌ప్ర‌ద హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, త‌ర్వాత ఆమెకి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇక అతిలోక సుందరి శ్రీదేవి 1978లో ‘ప‌ద‌హారేళ్ల వ‌య‌సు’ సినిమాలో చంద్ర‌మోహ‌న్ తో క‌లిసి ప‌ని చేసింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో శ్రీ‌దేవి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకిలేచింది. ఇక చంద్ర‌మోహ‌న్, జ‌య‌సుధ జంట‌గా క‌లిసి న‌టించిన చిత్రం ప్రాణం ఖ‌రీదు (1978). ఈ సినిమా త‌రువాత జ‌య‌సుధ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

1983లో వ‌చ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్ర‌మోహ‌న్ -విజ‌య‌శాంతి క‌లిసి న‌టించారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో త‌ర్వాత ఈ ఇద్ద‌రు ప్ర‌తిఘ‌ట‌న చేశారు. ఇది మంచి విజ‌యం సాధించ‌డంతో ఇక విజ‌యశాంతికి తిరుగులేకుండాపోయింది. ఇలా చాలా మంది హీరోయిన్స్‌కి చంద్ర‌మోహ‌న్ ల‌క్కీ హీరోగా మారారు. చంద్ర‌మోహ‌న్ ప‌క్క‌న న‌టించిన 60 మంది కథానాయికల్లో అత్యధికులు అగ్ర స్థానానికి చేరుకున్నారు. అయితే చంద్ర‌మోహ‌న్ కెరీర్ మొదట్లో సినిమాల‌లో న‌టించాల‌నే బ‌ల‌మైన కోరిక‌తో రెండు సార్లు ప్ర‌య‌త్నించాడు. ఆదుర్తి సుబ్బారావుని క‌లిసి త‌న ఫొటోలు ఇవ్వ‌గా, రెండు సార్లు పిలుపు వ‌చ్చింది. కాని అవ‌కాశం రాక‌పోవ‌డంతో ఆయ‌న బాప‌ట్ల‌లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ స‌మ‌యంలో బీఎన్‌రెడ్డి చంద్ర‌మోహ‌న్‌ని విజ‌యవాడ‌లో క‌లిసి ఆయ‌న ఆడిష‌న్ చూసాడు. ఇక కొద్ది రోజుల‌కి హీరోగా అవ‌కాశం ఇస్తాను మ‌ద్రాసు ర‌మ్మంటే నెల రోజులు సెల‌వు పెట్టుకొని వెళ్లాడు.. తొలిసారిగా రంగులరాట్నం సినిమా చేశాడు.ఈ సినిమాలో చొక్కా లేకుండా జిమ్ బాడీతో అంద‌రిని ఎంత‌గా అల‌రించాడు. ఈ సినిమా మంచి హిట్ కావ‌డంతో చంద్ర‌మోహ‌న్ కి తిరుగు లేకుండా పోయింది. దాదాపు 937 సినిమాల‌లో న‌టించాడు చంద్ర‌మోహ‌న్.